Dec 19,2022 19:26

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

ప్రజాశక్తి - రాయచోటి : అట్రాసిటీ కేసులలో బాధిత వ్యక్తులకు సత్వర న్యాయం అందించడమే ఎస్సీ, ఎస్టీ చట్టం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని, చట్టం కింద నమోదైన కేసులను వేగంగా విచారించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ గిరీష అన్నారు. సోమవారం కల్లెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్సీ,ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టం 1989 అమలుపై జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభంలో గత సమావేశంలో లేవనెత్తిన కేసులపై తీసుకున్న చర్యల గురించి కలెక్టర్‌ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. గత సమావేశంలో చర్చించిన 25 కేసుల్లో 2 తప్పుడు కేసులని, మిగిలిన అన్ని కేసుల్లో పరిహారం అందజేసినట్లు రాయచోటి ఆర్‌డిఒ కలెక్టర్‌కు వివరించారు. కేసు నంబరు 75/2022పై సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి (ఎస్‌సి సెల్‌-1) మాట్లాడుతూ హైకోర్టులో స్టే ఉందని, ఇతర కేసులు పూర్తయ్యాయని కలెక్టర్‌కు వివరించారు. సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి (ఎస్‌ సి సెల్‌ - 2), సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి, రాజంపేట, రాయచోటి, మదనపల్లె తమ పరిధిలోని కేసులను పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఈ ఏడాది జూలై నుండి నవంబర్‌ వరకు మొత్తం 20 కేసులు నమోదయ్యాయని జిల్లా పోలీసు అధికారులు కలెక్టర్‌కు తెలియజేశారు. వీటిలో 5 తప్పుడు కేసులుగా గుర్తించామని, సంబంధిత పోలీసు అధికారులు తెలిపారు.ఇతర కేసుల్లో విచారణ కొనసాగుతోందని వారు తెలిపారు. మదనపల్లె డివిజన్‌, రాయచోటి డివిజన్‌, రాజంపేట డివిజన్ల డిఎస్‌పిలు ఎస్సీ,ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల వివరాలను కలెక్టర్‌కు తెలియజేశారు. కేసుల విచారణ త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ కేసుల సంఖ్య బాగా తగ్గిందన్నారు. ఎఫ్‌ఐఆర్‌, ఛార్జిషీట్‌ దాఖలు, పరిహారం అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులను ఆయన కోరారు. జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ సరైన కేసుల్లో చార్జిషీట్‌ దాఖలు చేసే ప్రక్రియను పోలీసు అధికారులు వేగవంతం చేయాలని సూచించారు. కేసుల్లో దోషులకు తగిన శిక్ష పడాలన్నారు. రాజంపేట ఎంఎల్‌ఎ మేడా మల్లిఖార్జునరెడ్డి మాట్లాడుతూ ఎలాంటి పొంతన లేకుండా పెట్టిన కేసులను తగిన పరిశీలన అనంతరం ఎత్తివేసే ప్రక్రియ జరగాలన్నారు. వ్యక్తిగత కారణాలతో కొన్ని కేసులు పెడుతున్నారని, ఇలాంటి కేసులను తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మదనపల్లె, తంబళ్లపల్లె ఎమ్మెల్యేలు ద్వారకనాథరెడ్డి, నవాజ్‌ బాషా మాట్లాడుతూ ఎక్కువ శాతం ఎస్సీ,ఎస్టీ కేసులు భూ సమస్యలేనని చెప్పారు. మదనపల్లిలో జరిగిన కొన్ని కేసుల గురించి ఆయన చర్చించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని కమిటీ సభ్యులు కొందరు కలెక్టర్‌కు తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం బాధిత వ్యక్తులకు సత్వర న్యాయం అందించడమేనని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం అభియోగాలను ఎదుర్కొంటున్న ఏ ఉద్యోగిపైనైనా సస్పెన్షన్‌ను ఉపసంహరించుకునే హక్కు కలెక్టర్‌కు మాత్రమే ఉందని, సస్పెన్షన్‌ను ఉపసంహరించుకునే హక్కు సంబంధిత హెచ్‌ఒడికిి లేదని ఆయన జిల్లాకు చెందిన అన్ని శాఖల అధిపతులకు సూచించారు. ప్రస్తుత సమావేశంలో చర్చించిన కేసులపై తీసుకున్న చర్యల నివేదికను వచ్చే సమావేశానికి కమిటీ సభ్యులు అందజేయాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయా, కమిటీ సభ్యులు, పోలీసు అధికారులు, మదనపల్లె, రాజంపేట, రాయచోటి ఆర్‌డిఒలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.