Nov 15,2023 19:46

టిడిపి మేనిఫెస్టోను వివరిస్తున్న ఉమాపతి నాయుడు

ప్రజాశక్తి - ఆదోని
చంద్రబాబుతోనే ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని టిడిపి సీనియర్‌ నాయకులు ఉమాపతి నాయుడు తెలిపారు. బుధవారం ఆదోనిలోని 31వ వార్డు వడ్డెగేరిలో 'బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ' నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను, బాండ్లను అందించి సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడారు. అమరావతిని అభివృద్ధి చేసి సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని బలోపేతం చేసే దిశగా బాబు అడుగులు వేశారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని విమర్శించారు. మరోసారి బాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారని వివరించారు. టిడిపి ప్రభుత్వం ఏర్పడితే చేయబోయే అభివృద్ధి, సంక్షేమాల గురించి తెలిపారు. 20 లక్షల మంది యువతకు ఉపాధి, రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు, ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు, ప్రతి విద్యార్థికి రూ.15 వేలు, ప్రతి స్త్రీకి నెలకు రూ.1500, ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితం, స్త్రీలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారని తెలిపారు. బసాపురం రామస్వామి, జయరామ్‌, వెంకన్న, తిమ్మప్ప, వెంకటేష్‌, చిట్టి పాల్గొన్నారు.