Dec 06,2020 07:44

బాబ్రీ మసీదు ఉదంతం అక్కడ రామాలయ నిర్మాణంతో పూర్తయినట్టే అనిపిస్తుంది. కానీ, బాబ్రీ మసీదును ఎందుకు కూల్చారు? అది కూడా డిసెంబర్‌ 6నే ఎందుకు కూల్చారు? అన్న విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం.
హిందూత్వ సిద్ధాంతం 1923లో పుట్టింది. 1925లో పుట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ క్రమంగా ఈ సిద్ధాంతాన్ని నెత్తికెక్కించుకుంది. నిజానికి హిందూత్వ సిద్ధాంతానికి ఇద్దరు శత్రువులు లేదా రెండు అవరోధాలు అది పుట్టినప్పటి నుంచీ ఉన్నాయి. 1. లౌకికతత్వం. 2. సామాజిక న్యాయం. ఈ రెండింటినీ మట్టుబెడితేనే హిందూత్వం పూర్తి స్థాయిలో బలపడుతుంది. భారతదేశ చరిత్రను అనాదిగా పరిశీలించిన చరిత్రకారులందరూ చాలా స్పష్టంగా... హిందూ మతతత్వం అనేది బౌద్ధాన్ని నాశనం చేయడం నుంచి ప్రారంభమై...ఒక సామాజిక ప్రతీఘాత విప్లవం లాగా సాగుతూ వస్తున్నదని చెప్పారు. నేడు ముస్లిం, క్రైస్తవ మతస్తుల మీద ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘపరివార్‌ శక్తుల దాడి స్వభావాన్ని ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌ ఇలా వివరించారు. 'హిందూ మతం అభివృద్ధిలో ఒక కీలకమైన అంశం తన శత్రువులను- వారు హేతువాదులు కావచ్చు. నాస్తికవాదులు కావచ్చు. అగ్ర కుల ఆధిపత్యాన్ని ధిక్కరించేవారు కావచ్చు. లేదా నిమ్నజాతుల అభ్యున్నతికై పోరాడినవారు కావచ్చు. లేదా వేదాంగాల్ని తెగనాడినవారు కావచ్చు. వీరందరినీ రాక్షసులు, అసురులు, మ్లేచ్ఛులు, ఛండాలులు వంటి పదాలతో అణచి వేయటానికి పురాణేతిహాసాలను వాడుకున్నారు. ఇప్పుడు ఆకోవ లోకి ముస్లిం, క్రైస్తవులను ప్రతిష్టించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు' అని చెప్పారు. దీన్ని బట్టి మైనారిటీ మతాలు శూద్ర, అతి శూద్ర లేక అస్ప్రుశ్యులుగా చెప్పబడే దళితులు, గిరిజనులు వీరందరినీ అట్టడుగు స్థాయిలో ఉంచటం అన్నది అనాదిగానే వస్తున్న ఓ బలమైన ప్రయత్నంగా కొనసాగింది. ఈ స్పృహతో చూసినప్పుడు బాబ్రీ మసీదు కూల్చివేత కేవలం ముస్లింలకు వ్యతిరేకమైనదిగానే చూడటానికి వీలు లేదు. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త గెయిల్‌ ఓంవెట్‌ ''బాబ్రీ మసీదు కూల్చివేత దళితులు, ఆదివాసీలు, మహిళలు, బహుజనులు, శ్రమించే కులాలు, వర్గాలు ఎవరినైతే వర్ణాశ్రమ ధర్మం (కుల వ్యవస్థ) నీచులుగా చూస్తుందో వారందరి మీద ప్రకటించిన యుద్ధంగా చూడాలి'' అని సరిగానే పేర్కొన్నారు.
గాంధీజీ హత్య తొలి హెచ్చరిక
భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాలుగు నెలల్లోనే హిందూత్వ శక్తుల ప్రతిరూపమైన ఆర్‌ఎస్‌ఎస్‌ లేక హిందూ మహాసభల కార్యకర్త నాధూరాం గాడ్సే...గాంధీజీని కాల్చి చంపాడు. అతని మరణ వాంగ్మూలంలో ప్రకటించినట్టు, లౌకిక మార్గాన్ని ఎంచుకున్న స్వతంత్య్ర భారత దేశానికి గాంధీజీ హత్య హిందూత్వ శక్తుల తొలి హెచ్చరిక. 1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు కూల్చివేయడం రెండో హెచ్చరిక. ఈ రెండు దుర్ఘటనలు హిందూత్వ శక్తుల వల్లనే జరిగాయి. 1948లో గాంధీజీని హత్య చేసినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా హిందూత్వ శక్తులకు నామమాత్రపు బలమే ఉంది. అందుకనే వారు గాంధీజీని కుట్రపూరితంగా హత్య చేశారు. అయితే ఈ చర్యను నాడు యావత్‌ భారతదేశం అసహ్యించికుంది. బతికి బట్టకట్టడానికి 30 ఏళ్లు పట్టింది. కానీ 1980 నుంచి హిందూత్వ శక్తులు దాదాపు దశాబ్దం పాటు బాబ్రీ మసీదు కూల్చివేతను ఏకైక ఎజెండాగా పెట్టుకుని అల్లకల్లోలాలు సృష్టించారు. చివరకు 1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు కూల్చారు. 1948కి, 1992కి తేడా ఏమంటే బాబ్రీ మసీదు కూల్చిన అనంతరం హిందూత్వ శక్తులు క్రమ క్రమంగా బలపడటం జరిగింది. ఈ పరిణామాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కారణాలను గమనించాలి. 1980-1990 మధ్య మండల్‌ కమిషన్‌ సిఫార్సులపై తీవ్రమైన చర్చ జరిగింది. ఉలిక్కిపడిన హిందూత్వ శక్తులు మతోన్మాదపు దాడిని వివిధ రూపాల్లో పెంచాయి. దళిత బహుజనుల చైతన్యం పెరగటం... కులపీడన పైన, వివక్ష పైన ఒక్క మాటలో చెప్పాలంటే అగ్ర కుల ఆధిపత్యంపై పోరుకు పెద్ద భూమిక ఏర్పడ్డ కాలమిది. ''మండల్‌ × కమండల్‌'', రామ రాజ్యం × బలి (చక్రవర్తి) రాజ్యం'' వంటి నినాదాలు, చర్చలు ఆ కాలంలో పెద్ద ఎత్తున ముందుకొచ్చాయి. సాంఘికంగా అణగారిన తరగతులు, మైనారిటీల మధ్య ఐక్యత వివిధ రూపాల్లో ఆ కాలంలో పెరిగింది. అదే సందర్భంలో స్వాతంత్య్రం నాటి నుంచి ఏకఛత్రాధిపత్యం సాగించిన కాంగ్రెస్‌ పార్టీ అనేక రాష్ట్రాలలో ఓడిపోవటం, కేంద్రంలో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంపైన తీవ్రమైన అసంతృప్తి ప్రజల్లో పెరగడం గమనించిన పాలక వర్గాల్లోని అత్యధికులు...కేంద్ర స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ పరిణామాల వైపు ఆలోచనలు సాగించారు. దీనిని అనువుగా తీసుకుని భారత రాజకీయాలను పచ్చి మితవాదం వైపు మార్చడానికే హిందూత్వ శక్తులు బాబ్రీ మసీదును కూల్చివేయటం జరిగింది. ఈ 30 ఏళ్లగా ఈ ప్రక్రియ క్రమంగా ఊపందుకుని దేశ రాజకీయాలు పూర్తి స్థాయిలో మితవాదం వైపు మరలాయి. ఈ క్రమంలో మధ్యేవాద రాజకీయపార్టీలు మతతత్వంపై పోరాటంలో రాజీపడటమో, తాము హిందువులకు అనుకూలమే అని చెప్పుకోవడమో జరిగింది.పర్యవసానంగా బూర్జువా లౌకిక పార్టీలు బలహీనపడుతున్నాయి.లేదా బిజెపి పంచన చేరుతున్నాయి.
డిసెంబర్‌ 6నే ఎందుకు?
హిందూత్వ శక్తులు బాబ్రీ మసీదు కూల్చివేయడం అనేది అకస్మాత్తుగా జరిగిన ఘటన కాదు. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆ పద్ధతి లోనే మాట్లాడటం బాధాకరమైన విషయం. వాస్తవానికి బాబ్రీ మసీదును కూలుస్తామని నాటి ముఖ్యమంత్రి కళ్యాణ్‌సింగ్‌ వంటి వారు స్పష్టంగానే ప్రకటిస్తూ వచ్చారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన కూల్చివేత యథేచ్ఛగా 10 గంటలపాటు సాగింది. అందుకు సంబంధించిన అనేక వీడియోలను సిబిఐ గతంలోనే కోర్టుకు అందించింది. శ్రీకృష్ణ కమిషన్‌ వంటి అనేక కమిషన్లు ఈ దుర్మార్గపు చర్యను తూర్పారబట్టాయి. అందువలన డిసెంబర్‌ 6న కూల్చివేత అనేది కాకతాళీయం కాదు. దాని వెనుక హిందూత్వ శక్తుల స్పష్టమైన అవగాహన ఉంది. హిందూ మతతత్వానికి, దానికి మూలస్తంభమైన కుల వ్యవస్థ, కులాధిపత్యం, కుల వివక్ష వంటి వాటికి వ్యతిరేకంగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి డా||బి.ఆర్‌. అంబేద్కర్‌ వర్థంతి డిసెంబర్‌ 6. 1990 లోనే ఆర్‌ఎస్‌ఎస్‌ తన కింది స్థాయి అధినేతలకు, ప్రచారకులకు పంపిన రహస్య సర్క్యులర్‌ నెం.411 చదివితే వీరి అసలు కుట్ర అర్ధమవుతుంది. ఆ సర్క్యులర్‌ లోని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. 2వ అంశం- షెడ్యూలు కులాలు, వెనుకబడిన తరగతుల నుంచి పార్టీ లోకి రిక్రూట్‌ చేసుకుని వారి ద్వారానే అంబేద్కరైట్‌లు, ముస్లింల మీద పోరాటం నడపాలి. 5వ అంశం- వైద్యులు, ఫార్మసిస్టులకు హిందూత్వ సిద్ధాంతాన్ని బోధించి వారి సహాయంతో ఎస్‌సి, ఎస్‌టి, ముస్లింలకు కాలం చెల్లిన మందులు అందించాలి. 10వ అంశం- షెడ్యూల్డ్‌ కులాలు, తెగల విద్యార్థులు 'మనకు' అనుకూలంగా రాయబడిన చరిత్ర పుస్తకాలను చదివేలా చూడాలి. 15వ అంశం- హిందువులు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా రాయబడిన సాహిత్యాన్ని ధ్వంసం చేయాలి. 20వ అంశం- సమానత్వం బోధించే కమ్యూనిస్టులు, అలాగే అంబేద్కరైట్‌లు, ఇస్లాం బోధకులు, క్రిస్టియన్‌ మిషనరీలపై భౌతిక దాడులు ప్రారంభించాలి. 16వ అంశం- ఎస్‌సి, ఎస్‌టి, బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఎట్టి పరిస్థితుల్లో నింపరాదు. ప్రమోషన్లలో వారికి అవకాశాలు నిరాకరింపబడాలి. అందుకు వారి సర్వీసు రికార్డులను తప్పుడు రిపోర్టులతో నాశనం చేయాలి (బిశ్వాస్‌, శ్యాం చంద్‌ రాసిన పుస్తకాల నుంచి). దీన్నిబట్టి 1990 నాటికే బాబ్రీ మసీదు కూల్చివేత మాటున ప్రజాతంత్ర ఉద్యమ పురోగతిని, ప్రత్యేకించి అణగారిన తరగతుల ఆకాంక్షలను, వాటి కోసం రూపుదిద్దుకుంటున్న ఉద్యమాలను వెనక్కి కొట్టటమనే కుట్ర దాగి ఉందనేది స్పష్టమవుతుంది.
సరైన గుణపాఠాలు తీయాలి
ఈ పరిస్థితుల్లో బాబ్రీ మసీదు కూల్చివేయబడి మూడు దశాబ్దాలయినా సరైన గుణపాఠాలు తీసుకోనిదే హిందూత్వ శక్తుల పాశవిక దాడులను, వారి పురోగమనాన్ని నిలువరించటం సాధ్యం కాదు. దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తొలి దశాబ్దాలలో లౌకికవాదం కోసం, సామాజిక న్యాయం కోసం ప్రజలందరూ దాదాపుగా ఐక్యంగా ఉన్న పరిస్థితులు ఈరోజు లేవు. ప్రధాన కారణం ఉదారవాద ప్రజాస్వామ్య పార్టీలు, లౌకిక బూర్జువా పార్టీలు భారత చరిత్ర గమనంలోనే ఇమిడి వున్న మతతత్వ ప్రమాదాన్ని అర్ధం చేసుకోకపోవడం. తీరా మతోన్మాద ప్రమాదం ముంచుకొచ్చేసరికి లౌకికవాదాన్నే పక్కనబెట్టి మతోన్మాద పోకడలు పుణికిపుచ్చుకోవడం. ఈ పరిస్థితులలో నిజమైన లౌకికతత్వానికి కట్టుబడి, కుల వ్యవస్థను సమూలంగా నిర్మూలించడం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందనే సైద్ధాంతిక స్పష్టతతో పోరాడుతున్న కమ్యూనిస్టులే హిందూత్వ శక్తులను శాశ్వతంగా మట్టుబెట్టడంలో కీలక పాత్ర నిర్వహించగలుగుతారు. అందుకుగాను వామపక్ష పార్టీలు, ఇతర ప్రజాతంత్ర లౌకిక పార్టీలను, సామాజిక సంఘాలను, మైనార్టీ సంఘాలను, వ్యక్తులను దేశవ్యాప్తంగా ఐక్యం చేసి నడిపించాల్సిన చారిత్రక బాధ్యత కమ్యూనిస్టుల మీద ఉంది.
నయా ఉదారవాదం అనేది కేవలం ఆర్థిక రంగంలో మాత్రమే కాక, సామాజిక, సాంస్కృతిక రంగాలన్నింటా వ్యాప్తి చెందిన బూర్జువా వర్గ దృక్పథం. నయా ఉదారవాద భావాల ద్వారా వ్యక్తమవుతున్న బూర్జువా భావజాలాన్ని నిరంతరం ప్రతిఘటించవలసిన అవసరం ఉన్నది. సమాజంలో పాదుకుంటున్న హిందూత్వ పెడ ధోరణికి, ఇతర మతోన్మాద రూపాలకూ వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటం సాగించవలసిన అవసరం కూడా ఉన్నది. సామాజిక, సాంస్కృతిక రంగాలలో సైతం ఈ పోరాటాన్ని సాగించాలి. కుల దురవగాహనలను, ప్రాంతీయ దురహంకారాలను, వేర్పాటువాదాన్నీ పెంచి పోషిస్తున్న సంకుచిత అస్తిత్వ విధానాలకు, ఒంటెత్తువాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా కూడా పోరాటాన్ని నిర్వహించాలి.

                                                                    ఆర్‌.ర‌ఘు

                                                           నేడు బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజ్యు
                                              (వ్యాసకర్త సిపిఐ(ఎం) కృష్ణా జిల్లా తూర్పు కమిటీ కార్యదర్శి)

 

raghu