భానుడి ప్రతాపంతో జనం విలవిల
రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు
ప్రజాశక్తి-రాయచోటి: ఎండలు మండిపోతున్నాయి.. మాడలు మలమల మాడుతున్నాయి.. భానుడి భగభగలతో జనాలు విలవిల్లాడుతున్నారు.. ఉదయం 8 గంటలకే ఉప్పెనలా ఎండలు ఆరంభమై సాయంత్రం 6 గంటల వరకు తీవ్రంగా కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరి, ఎన్నడు లేనివిధంగా అత్యధికంగా నమోదవుతున్నాయి. రోజురోజుకు క్రమక్రమేనా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే నాలుగు రోజుల నుంచి 41-43 డిగ్రీలు దాటుతూ వస్తోంది. రోజు రోజుకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం బెంబెలెత్తి పోతున్నారు. మరో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాలులు వీస్తాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
రోడ్ల మీద జనం లేక..
జిల్లా కేంద్రమైన రాయచోటిలో బుధవారం వేసవి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటి పోవడంతో మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోతున్నాయి. ఎండలకు తోడు వడగాలులు కూడా వీస్తోండటంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎక్కడా చూద్దామన్న రోడ్లపై ఒక్కరూ కనిపించడం లేదు. ప్రధాన రోడ్లతో సహ అన్ని రహదారులు నిర్మానుషంగా కనిపిస్తున్నాయంటే కర్ఫ్యూ లాగుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపే ప్రజలు పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు. ఆపై ఏమైనా పనులు ఉంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత బయటకు వస్తున్నారు. అంటే దాదాపు మధ్యాహ్నం నాలుగు గంటల పాటు రోడ్లపై ఒక్కరూ కనబడడం లేదు.
ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి..
ఎండ వేడిమితో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. బయటకు వద్దామంటే ఎండ.. ఇంట్లో ఉంటే ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరుకోవడంతో ఫ్యాన్లు, కూలర్లు కూడా సరిపోవడం లేదు. ఫ్యాన్లు వేసినా వడగాలి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైతే బయటకు వచ్చిన సమయాల్లో కూడా ఎండ నుంచి రక్షణ పొందేందుకు గొడుగులు, టవళ్లు, టోపీలను ఆశ్రయిస్తున్నారు. మరో పక్క దాహార్తిని తీర్చుకోవడానికి శీతలపానీయాలు చెరుకు రసం, లస్సీ, జ్యూస్ లాంటివి సేవిస్తున్నారు. మొత్తానికి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగత్రలు..ఎండ వేడిమితో ప్రజలు సతమతమవుతున్నారు. ఇలానే పెరుగుతూ వడగాలులు తీవ్రమైతే వడదెబ్బకు గురికాకుండా వేసవితాపం నుంచిరక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్ల వద్దని చెబుతున్నారు.
మజ్జిగ ఎక్కువగా తాగాలి...
వేసవి కాలంలో ఎండ వేడి నుండి కాపాడుకోవాలంటే ప్రజలు శీతల పానీయాలను తాగకుండా చక్కగా నిమ్మకాయతో కలిపిన మజ్జిగను ఎక్కువగా తాగినవల్ల నీరసం రాకుండా ఎండ వడదెబ్బ తగలకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు. పానీయాలు ఎప్పటికప్పుడు ఉపశమనం కలిగిస్తాయి తప్ప వాటి వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం ఉంది. శీతల పానీయాలలో రుచి కోసం రంగు కోసం పలు రకాల కెమికల్ పదార్థాలను కంపెనీలు వాడి ప్రజలను ఆకర్షించే విధంగా చేస్తున్నారు.
- ప్రకాష్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి, జెవివి, రాయచోటి.
ఎండకు ఎవరూ తిరగొద్దు..
ప్రజలు ఎవరూఎండల్లో తిరగవద్దు. వడదెబ్బకు గురికాకండి. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ వేడిమి ఎక్కువగా ఉండటం వల్ల వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇంటి దగ్గర కూడా మజ్జిగ, నిమ్మరసం, పండరసాలు కర్పూజ పండ్లు, తాటి నుంజలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితులు అయితేనే బయటికి రావాలి. వడదెబ్బకు గురైతే ప్రభుత్వ వైద్యుల సలహాలు, సూచనలు పాటించి వైద్య సేవలు పొందాలి. జిల్లాలోని అన్ని పిహెచ్‌సిల్లో మందులు అందుబాటులో ఉన్నాయి.
- డాక్టర్ ఎన్.కొండయ్య, డిఎంహెచ్‌ఒ, రాయచోటి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని, వడగాల్పులు ఎక్కువ అవుతున్నాయని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో 41 నుంచి 43 డిగ్రీల వరకు ఎండలు భగ్గుమంటున్నాయి. వడగాడ్పుల ముప్పు పొంచి ఉంది. రోహిణి కార్తె సమీపించినందున ఎండలు పెరుగుతాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
- పిఎస్.గిరీష, కలెక్టర్, అన్నమయ్య జిల్లా.
- రాయచోటిలో ఎండ వేడిమితో మధ్యాహ్నం వేళలో నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు










