అయ్యవారిపల్లిలో పొలంబడి
ప్రజాశక్తి-సీతారామపురం : మండలంలోని అయ్యవారిపల్లి రైతు భరోసా కేంద్రలో జరుగుతున్న డాక్టర్ వైఎస్‌ఆర్ పొలంబడి కార్యక్రమాన్ని బుధవారం డిఆర్‌సి ఎడిఎ లక్ష్మీ మాధవి, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సురేఖ దేవి పరిశీలించారు. పొలంబడి రైతులకు సలహాలు సూచనలిచ్చారు. ఇంటర్నేషనల్ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా రైతులందరూ చిరుధాన్యాలను పండించాలని వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. అలాగే ప్రతిపంటను పరిశీలించి రసం పీల్చే పురుగుల నివారణకు డై ఫెంతురాన్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని తెలియజేశారు. పత్తిలో మెగ్నీషియం లోపం ఉన్నట్లయితే మెగ్నీషియం సల్ఫేట్ 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు, 90 రోజుల లోపు పత్తి పంటకు తయోమెథాక్షమ్, ఇమిడాక్లోప్రిడ్ మందులు వాడరాదని సూచించారు. అలాగే మిరపలో కాయకుల్లు తెగులు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ 30 గ్రాములు 10 లీటర్ల నీటికి, స్టెప్టోసైక్లిన్ ఒక గ్రాము పది లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎఇఒ నారాయణ, విఎఎలు నరేంద్ర, లక్ష్మీనారాయణ, గ్రామ రైతులు పాల్గొన్నారు.










