May 08,2023 21:38

ఫొటో : డిప్యూటీ తహశీల్దార్‌కు విజ్ఞప్తి చేస్తున్న లేబూరు రైతులు

ఆయకట్టు డొంకలో ఆక్రమణలు
- డిప్యూటీ తహశీల్దార్‌కు లేబూరు రైతులు విజ్ఞప్తి
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : వ్యవసాయ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తున్న వ్యవసాయం ఆయకటు డొంకలో ఆక్రమణలు చేపడుతున్నారని లేబూరు రైతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు సోమవారం ఇందుకూరుపేట తహశీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్‌ను కలిసి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి తమకు న్యాయం చేయాలని వినతి పత్రం అందించారు.
అనంతరం సిపిఎం సీనియర్‌ నాయకులు, లేబూరు గ్రామస్తులు గూడూరు ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ తమ వ్యవసాయ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల రాకపోకలకు సర్వే నెంబర్‌ 374లో 500 ఎకరాల ప్రభుత్వ ఒఎన్‌జిసి రహదారి డొంకలో రాకపోకలు సాగిస్తున్నామని తెలిపారు. అయితే నిర్వాసితుల పేరుతో ఈ దారిని ఆక్రమించుకొని దారికి అడ్డంగా పశువులను కట్టివేసి గ్రామ రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. అయితే డొంక ఆక్రమణ నిర్వాసితులు స్థానిక శాసనసభ్యులను కలిసి తమకు పక్కాగా పట్టాలు మంజూరు చేయాలని కోరడంతో ఆయన వాస్తవాలు విచారించకుండానే నిర్వాసితులకు పట్టాలు మంజూరు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుందన్నారు. ఈ విషయంలో తమరు పూర్తి విచారణ జరిపి నిర్వాసితులకు మరో ప్రాంతంలో నివేశన పట్టాలు మంజూరు చేసి గ్రామస్తులకు అవసరమైన రహదారి డొంకను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.