ప్రజాశక్తి కదిరి అర్బన్ : ఆయారాం.. గయారాం... చందంగా కదిరి మున్సిపల్ సమావేశం ముగిసింది. ఏదో టీ, బిస్కెట్‌తో సమావేశం ముగిసిందని అధికార పార్టీ కౌన్సిలర్లే జోకులు వేసుకున్న సందర్భం కదిరి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం హాల్లో చోటు చేసుకుంది. మంగళవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్ నజీమున్నీసా అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపాలిటీ పరిధిలోని అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు హాజరయ్యారు. ఒకరినొకరు పలకరించుకొని టీ బిస్కెట్ తీసుకున్నంత సమయంలోనే సమావేశం ముగిసిందని అందరూ బయటికి వెళ్లిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సమావేశంలో పట్టణ పరిధిలోని వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలి అనే అజెండా కూడా చర్చకు రాకుండా ఉండడం చూస్తుంటే పట్టణ అభివృద్ధిపై పాలకులకు ఏ మాత్రం శ్రద్ధ ఉందో అర్థమవుతోందన్న వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. ప్రభుత్వానికి కదిరి మున్సిపాలిటీ ఆదాయాన్ని ఇచ్చే మాస్టర్ ప్లాన్ చర్చ కూడా జరగలేదు. వాటిని ముందుగానే ప్లాన్ చేసుకొని కాంట్రాక్టు పనులకు మాత్రమే తీర్మానించి మిగతా విషయాలన్నీ తీర్మానానికి పెట్టకుండానే సమావేశం ముగిసినట్లు ప్రకటించారు. మార్చి మొదటి వారంలో ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధి, కోనేరు సమస్యలను సమావేశంలో ప్రస్తావించకపోవటం విడ్డూరంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. బ్రహ్మోత్సవాల గురించి అటు పాలకులు, ఇటు అధికారులు ప్రస్తావించకపోవటం గమనార్హం. 'వచ్చి పోవమ్మా..మెరుపుతీగ' అన్న చందాన సమావేశాలు ఎందుకు నిర్వహించాలని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమావేశాలకు ప్రజాధనం దుర్వినియోగం చేయడంతో పాటు సమయం కూడా వృథానే అని వ్యాఖ్యానిస్తున్నారు. సమావేశం జరిగిన కొద్దిసేపు ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు.










