రాజంపేట : మున్సిపాలిటీలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మున్సిపాలిటీ ఎదురుగా రాష్ట్ర కమిటి పిలుపు మేరకు కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఆనారోగ్యంతో బాధపడుతున్న కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. పర్మినెంట్ కార్మికులకి సిపిఎస్ రద్దు చేయాలన్నారు. క్లాప్ డ్రైవర్‌లకు రూ.18,500 జీతం వర్తింపచేయడంతో పాటు ఇఎస్‌ఐ, ఇపిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క ఉద్యోగ, కార్మికులందరికీ అధికారులే అర్హత కల్పించాలన్నారు. మా ప్రభుత్వం వస్తే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కార్మికులను పర్మినెంట్ చేస్తానని ముఖ్యమంత్రి జగన్ గతంలో మాట ఇచ్చారని తెలిపారు. నేడు మునిసిపల్ కార్మికులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల తరుణంలో మునిసిపల్ కార్మికులు తమ సత్తా ఏమిటో చూపుతారని ఈ ప్రభుత్వనికి తగిన గుణపాఠం చెబుతారని ఆ పరిస్తితి తెచ్చుకోవద్దని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు ఒబయ్య, ప్రసాద్, రవి శంకర్, సుబ్బారాయుడు, కె.సుబ్బమ్మ, రమణమ్మ,నాగరాజమ్మ, లక్ష్మిదేవి పాల్గొన్నారు










