అనంతపురం కలెక్టరేట్ : ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు అందరికీ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రభుత్వం ముఖహాజరు నమోదును తప్పనిసరి చేసింది. ఉదయం 10 గంటలకు కార్యాలయానికి రాగానే ఆన్‌లైన్‌లో ముఖ హాజరు నమోదు వేయాలి. సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో కూడా ముఖహాజరు నమోదు చేసి వెళ్లాలి. 10 గంటలు దాటితే ఆరోజు ఉద్యోగి విధులకు హాజరుకాలేదని భావించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిబంధనపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 1400 వేలకు పైగా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో 41 వేలకుపైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ప్రతి రోజూ వీరు కార్యాలయానికి వెళ్లగానే రిజిస్టర్‌లో సంతకాలు చేసేవారు. ప్రస్తుతం దీనికి అదనంగా ముఖ హాజరును ప్రభుత్వం తప్పని సరి చేసింది. ఉదయం 10 గంటల్లోపు ముఖహాజరులో వారి హాజరు నమోదు కావాలి. ఉద్యోగుల హాజరు నమోదు వివరాలు పరిశీలించే బాధ్యతను వేతనాలు చెల్లించే జిల్లా ఖజనా శాఖ కార్యాలయానికి అప్పగించారు. పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది కూడా ముఖహాజరును నమోదు చేయించుకోవాలి. ముఖ హాజరును ఏపీ సెంటర్‌ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్, సర్వీసెస్ నిర్వహించనుంది. ప్రతి ఉద్యోగి తన ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రమే యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఉద్యోగులు పని చేసే కార్యాలయాలను సెంటర్ పాయింట్‌గా చేసుకుని ఆ పరిసరాల్లో 200 మీటర్లలోపు మాత్రమే యాప్ పని చేస్తుంది. ఫోన్లకు జియోట్యాగ్ అనుసంధానం చేసినందున ఆ ప్రాంతానికి దూరంగా ఉంటే యాప్ పని చేయదు. ఇలా ప్రతి రోజూ ఉద్యోగి వారి కార్యాలయానికి సమీపంలో ముఖ హాజరు నమోదు చేయాలి.
అనేక సమస్యలు... ఉద్యోగుల్లో టెన్షన్
ముఖ హాజరు వేసేందుకు అనేక సమస్యలు ఉన్నాయి. దీంతో ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. ప్రభుత్వం నిర్ణయించిన సమయం లోపు ముఖహాజరు వేయకుంటే ఆరోజు విధులకు ఆలస్యం అయినట్లు పరిగణిస్తారు. మూడు సార్లు ఆలస్యంగా వేస్తే ఒక సిఎల్ కింద పరగణిస్తారు. సాయంత్రం వేయకుంటే సగం రోజు మాత్రమే పని చేసినట్లు లెక్కలోకి వస్తుంది. ఈ హాజరు ఆధారంగానే వేతనాలు చెల్లింపులూ ఉంటాయి. మండల స్థాయిలో పనిచేసే ఎంపిడిఒలు, తహశీల్దార్లు, ఉపాధి సిబ్బంది, ఇంజినీరింగ్ తదితర విభాగాధికారులు ఎక్కువ శాతం క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సి ఉంది. వీరంతా ప్రతి రోజు వారు పనిచేసే కార్యాలయానికి వచ్చిన తరువాతనే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలి. సాయంత్రం కూడా తప్పని సరిగా కార్యాలయానికి రావాల్సి ఉంటుంది.
వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు
ఫేస్‌యాప్‌కు సంబంధించి సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కార్యాలయాలు ఉండే ఉద్యోగులకు మరింత సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. సాంకేతిక సమస్యల కారణంగా యాప్ పని చేయడం లేదు. గత మూడు రోజులుగా పలు చోట్ల ఉద్యోగులు యాప్ పని చేయక ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక పరిజ్ఞానం తక్కువ ఉన్న ఉద్యోగులు మరింత అవస్థలు పడుతున్నారు. సమయానికి కార్యాలయానికి చేరుకోకున్నా, సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అయినా ఆరోజు విధులు నిర్వహంచినా హాజరు నమోదు అవదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ముఖ హాజరును తప్పనిసరి చేస్తున్నారని, ప్రభుత్వ అధికారులను ఇలా ఇబ్బందులకు గురి చేయడం తగదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.










