Jul 04,2021 11:36

   ప్రతిరోజూ సాయంత్రం తాతయ్యతో కలిసి షికారుకు వెళ్ళడం నవీన్‌కు అలవాటు. ఆ ఊరి చివర ఒక చిన్న పూరిగుడెసెలో గోవిందమ్మ అనే ముసలమ్మ ఉండేది. అది చూసిన నవీన్‌కు చాలా బాధేసింది.
'తాతయ్యా ఆ ముసలమ్మ ఒక్కతే ఇక్కడ ఉంటుంది కదా! ఆమెకెవరూ చుట్టాలూ, బంధువులు లేరా?' అని అడిగాడు.
'లేకేం.. బస్తీలో బంధువులు ఉన్నారు. ఈ మధ్య కరోనా వల్ల ఇంట్లో వాళ్లంతా చనిపోయారు. ఇక మిగిలిన చిన్న కొడుకు ఇక్కడ పనులు లేక పట్టణం వెళ్ళిపోయాడు. ఆ ముసలమ్మ మాత్రం ఎక్కడికీ కదలడానికి వీలుకాక ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది పాపం!' అంటూ తాతయ్య చెప్పాడు.
'అయ్యో! మరి ఆమెకు తిండి ఎలా?' అడిగాడు నవీన్‌.
'ఆమె వడ్లగింజలు సంపాదించుకుని, జాగ్రత్తగా దాచుకుంటుంది. రోజూ వాటిని దంచుకుని, ఒక పూట అంటే మధ్యాహ్నం వేళ వండుకు తింటుంది. అదే ఆమె ఆహారం. మరి ఏ ఇతర ఆహారం తినడానికి ఇష్టపడదు' అంటూ తాతయ్య చెప్పాడు. నవీన్‌ ఆలోచనలోపడ్డాడు.
మరుసటి రోజు తాతయ్యతో షికారుకు వచ్చిన నవీన్‌ ఎలుకల బోనులో ఒక ఎలుకను తెచ్చి ముసలమ్మ ఇంటి దగ్గరలో విడిచిపెట్టాడు. 'అయ్యో అదేం పనిరా?' అని తాతయ్య మందలించాడు.
నవీన్‌ ముఖం చిన్నది చేసుకుని, 'తాతయ్య ఈ ఎలుక చుట్టుపక్కల పొలాల నుండి వడ్ల కంకెలు తెచ్చి, ఈ దగ్గర బొరిలో విడిచి పెడుతుంది. వాటిని ముసలమ్మ సేకరించి, వాటితో ధాన్యం చేసుకుంటుంది కదా!' అని అమాయకంగా నవీన్‌ చెప్పాడు.
తాతయ్య ముసిముసిగా నవ్వుతూ 'ఒరేరు అబ్బాయి నీ అధిక తెలివితేటలు చాలించు. ఆ ఎలుక ముసలమ్మ ఇంటిలో చేరి, బొరియలు చేసి అంతా చెడగొడుతుంది. అంతేగానీ మరి ఎందుకు పనికి రాదు' అంటూ మందలించాడు.
మరుసటి రోజు సాయంత్రం తాతయ్య, మనవడు ఎప్పటిలాగే ఊరి చివరకు షికారుకు వెళ్లారు. 'ఎక్కడి నుండి వచ్చిందో ఏమో ఎప్పుడూ లేదు ఎలుక ఒకటి చేరింది. రాత్రి నా చీర కూడా కొరికేసింది' అంటూ ముసలమ్మ బాధపడటం వారి కంటపడింది.
'చూశావా!' అని మనవడు వైపు చిరుకోపంగా చూశాడు తాతయ్య. నవీన్‌ తలదించుకున్నాడు.
కొద్ది సమయం తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరలా ఇంకొక రోజు సాయంత్రం ముసలమ్మ ఇంటి దగ్గర నవీన్‌ ఒక పిల్లిని విడిచిపెట్టాడు. తాతయ్య వాడి నిర్వాకం చూసి నవ్వుకున్నాడు.
ఆ మరుసటి రోజు ఎప్పటిలాగే తాతా-మనవళ్లు కలిసి షికారుకి వెళుతున్నారు. ముసలమ్మ ఇల్లు రానే వచ్చింది. 'రాత్రంతా ఎక్కడినుండో పిల్లి వచ్చింది. అదీ ఎలుక వేసే చిందులకు నాకు రాత్రంత నిద్ర లేదు. ఆ ఎలుకను చూసి పిల్లి వెంబడించక మానదు. ఏమిటో' అంటూ ముసలమ్మ పెద్దగా గొణుగుతూ ఉంది. ఆ మాటలు తాతా మనవడి చెవుల వరకు చేరాయి. తాతయ్య మనవడిని చూసి బోసిగా నవ్వాడు.
ఆ మరుసటి రోజు నవీన్‌ కుక్కను తెచ్చి ముసలమ్మ ఇంటి ముందు విడిచి పెట్టాడు. అది ఆ ఇంటి పరిసరాల్లో తిరగడం ప్రారంభించింది. పిల్లి కనబడగానే కుక్క వెంటపడి మరీ ఇంట్లో వరకూ తరిమి కొట్టేది. ఆ గందరగోళం ముసలమ్మ భరించలేకపోయేది. తాను చేసిన తప్పేంటో తెలుసుకున్న నవీన్‌ కుక్కను తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు. అలాగే పిల్లిని ముసలమ్మ ఇంటిలో నుంచి తరిమేశాడు. ఎలుకను బోనులో పట్టి, దూరంగా విడిచిపెట్టాడు. ముసలమ్మ ఆ మూడింటి బాధ తప్పిన తరువాత ''హమ్మయ్యా!'' అంటూ నిట్టూర్చింది.
తాతయ్య మనవడిని చూసి నెమ్మదిగా 'అబ్బాయి! మనం అవసరం లేని వారికి సహాయం చేయకూడదు. అనవసర సాయం కీడు తెస్తుంది' అని హితవు చెప్పాడు.
'ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయను!' అని నవీన్‌ తాతయ్యకు మాట ఇచ్చాడు.
 

- బెహరా ఉమామహేశ్వరరావు
92900 62336