అవకాశమిస్తే అభివృద్ధి చేస్తా..
- ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు ధనుంజయ రెడ్డి
ప్రజాశక్తి-వరికుంటపాడు : తాను మెట్ట ప్రాంతానికి చెందిన వ్యక్తినే, రైతు సమస్యలు తెలిసిన వ్యక్తిని అని ఒక్కసారి అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు మెట్టుకూరు ధనుంజయరెడ్డి అన్నారు. మంగళవారం వరికుంటపాడు వైసిపి మండల పార్టీ కన్వీనర్ బాల గురువారెడ్డి గృహంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి నేతల సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. త్వరలోనే ఉదయగిరి నియోజకవర్గానికి మంచి సమర్థత కలిగిన ప్రజా సమస్యలు పరిష్కరించ గలిగిన వ్యక్తి ఇన్‌ఛార్జిగా వస్తారని తెలిపారు. అలాగే తాను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే పోటీ చేసేందుకు సిద్ధమని, తనపై కొంతమంది వ్యక్తులు స్థానికేతరుడు అంటూ విమర్శిస్తున్నారని అలాంటి వ్యక్తులకు తాను చెప్పేదొకటేనని తాను ఏడు సంవత్సరాల పాటు కోఅపరేటివ్ బ్యాంక్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశానని, అలాగే తన స్వగ్రామం కూడా నియోజకవర్గానికి అతి దగ్గరగా ఉంటుందని, తన గ్రామం కూడా మెట్ట ప్రాంతంలోనే ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ప్రజలను ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, నాడు-నేడు, 1వ తేదీన పెన్షన్ పంపిణీ, సచివాలయ వ్యవస్థ గ్రామ వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి గ్రామ స్వరాజ్యం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. తనకు అవకాశం కల్పిస్తే మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో తాగు, సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి ప్రజల అభివృద్ధికి బాటలు వేసే నేతనే ఉదయగిరి నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమిస్తారని తెలిపారు. వరికుంటపాడు మండలంలో అనేక సమస్యలు ఉన్నాయంటూ మండల పార్టీ కన్వీనర్ బాల గురవారెడ్డి జెడ్‌పిటిసి రావెళ్ల నాగేంద్ర, నియోజకవర్గ పరిశీలకులు మెట్టుకూరు ధనుంజయ రెడ్డి దృష్టికి తీసుకురాగా ముఖ్యంగా రెవెన్యూ పరమైన సమస్యలు అధికంగా ఉన్నాయని కార్యాలయానికి వెళ్తే పట్టించుకోవడం లేదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్‌పిటిసి శ్రీనివాస నాయుడు, సర్పంచులు సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, నేతలు మస్తానయ్య, తదితరులు పాల్గొన్నారు.










