ప్రజాశక్తి-హిందూపురం అవినీతికి పాల్పడిన పురపాలక సంఘం పరిధిలోని మెప్మా విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆర్‌పి రాణిని వెంటనే విధుల నుంచి తొలగించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు డిమాండ్ చేశారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో మెప్మా విభాగం ముందు ఆయా మహిళా సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ఐశ్వర్య లక్ష్మి సమైక్య పరిధిలో 20 మహిళా సంఘాలు ఉండగా రాణి ఆర్‌పిగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈమె బోగస్ చెక్కులు ఉపయోగించుకుని ఒకసారి రూ.1.50 లక్షలు, రెండోసారి రూ.లక్ష, మూడోసారి రూ.50 వేలు బ్యాంకు నుంచి నగదు డ్రా చేశారన్నారు. దీంతో పాటు ఈమె వేతనం బ్యాంకు ద్వారా తీసుకోవడంతోపాటు సమైక్యలో నిలువ ఉన్న నగదును తీసుకుందన్నారు. ఈ వ్యవహారాలన్నీ బయటకు రావడంతో సమైక్యను 16 సంఘాలు కలిసి ఈమెను వెంటనే తొలగించాలని తీర్మానం చేసి మెప్మా అధికారులకు ఇచ్చినప్పటికీ ఇంతవరకు తొలగించలేదన్నారు. దీంతోపాటు ఆమెకు అనుకూలంగా ఉన్నవారికి సమైక్యలో అందించే రుణాలపై రూపాయి వడ్డీ, అనుకూలంగా లేని వారికి రూ.2 వడ్డీని వసూలు చేస్తోందని ఆరోపించారు. వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
మెప్మా కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న మహిళలు










