Mar 31,2023 22:49

కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్న సభ్యులు

ప్రజాశక్తి-హిందూపురం : పురపాలక సంఘంలో అన్ని విభాగాల్లోనూ అవినీతి రాజ్యమేలుతుందని.... పట్టణ ప్రణాళిక విభాగం అయితే అవినీతికి హబ్‌ గా మారిందని కౌన్సిలర్‌ శివ ఆరోపించారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఇంద్రజ అధ్యక్షతన కౌన్సిల్‌ సాధారణ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్‌ అధికారులు 41 అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కౌన్సిలర్‌ రమేష్‌ కుమార్‌ ప్రతి అంశాన్ని చైర్‌ పర్సన్‌ ర్యాటిపై చేయడాన్ని అభ్యంతరం తెలిపారు. అత్యవసర పనులకు సంబంధించిన అంశాలను మాత్రమే రాటిఫై చేయాలని సూచించారు. అజెండాలోని 14, 15 అంశాలకు సంబంధించి అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లు డీసెంట్‌ నోటీసును చైర్‌ పర్సన్‌ ఇంద్రజకు ఇచ్చి రద్దు చేయాలని కోరారు. మున్సిపల్‌ అధికారులకు వార్డు కౌన్సిలర్లు అంటే కనీస గౌరవం లేదని, వార్డుల్లో తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పనులు చేస్తున్నారని కౌన్సిలర్‌ నాసిరబాను వాపోయారు. వార్డులో నెలకొన్న సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కనీస స్పందన సైతం అధికారుల్లో లేదన్నారు. తాము కౌన్సిలర్లు అని చూపించాలంటే ప్రతినెల ప్రమాణస్వీకారం చేయాల్సిన దుస్థితి హిందూపురం పురపాలక సంఘంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వ మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారుల చర్యల వల్ల పార్టీ పరువు మంటగలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పురపాలక సంఘంలో మున్సిపల్‌ కమిషనర్‌ తో పాటు అన్ని విభాగాల్లోనూ ప్రధాన అధికారుల కొరత ఉందని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ను ప్రశ్నించారు. అవినీతికి హబ్‌ గా పట్టణ ప్రణాళిక విభాగం మారిందని, బైపాస్‌ రోడ్డులో సర్వే నంబర్‌ 95/2 హిందూపురం పార్ట్‌ 2 లో ఉన్న కమర్షియల్‌ స్థలాన్ని రెసిడెన్షియల్‌ జోన్‌ గా మార్చడంతో పాటు అక్కడ పాత భవనం ఉన్నట్లు సృష్టించి, ఆ పాత భవనం పడగొట్టి నూతన భవన నిర్మాణం చేపడుతున్నట్లు చూపుతున్నారని ఆరోపించారు. పురపాలక సంఘానికి రావలసిన దాదాపు రూ. 60 లక్షల పన్ను అధికారులు ఎగ్గొట్టారన్నారు. దీంతోపాటు పట్టణంలో వివిధ ప్రాంతాలలో షెడ్ల నిర్మాణం పేరుతో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. దీనిపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ ఆనంద్‌ కుమార్‌ కౌన్సిల్‌ కు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని, చైర్‌ పర్సన్‌ కు మాత్రమే సమాధానం చెప్తానని చెప్పడంతో సమావేశం కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ లతో పాటు కౌన్సిలర్లు అందరూ గౌరవ కౌన్సిల్‌ ను అగౌరవపరిచే విధంగా ఈసీపీ మాట్లాడాలని నిలబడి నిరసన తెలిపారు. చివరకు ఏసీపీ క్షమాపణ చెప్పడంతో పాటు విచారణ చేసి నివేదికను కౌన్సిల్‌ దృష్టికి తీసుకు వస్తానని చెప్పడంతో సభ్యులందరూ శాంతించారు. మూడు అంశాలు మినహాయించి మిగిలిన అన్ని అంశాలు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో వైస్‌ చైర్మన్లు జబివుల్లా, బలరామిరెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ మెంబర్లు, అన్ని విభాగాలకు చెందిన మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.