జగన్ పాలనలో అందరూ బాధితులే
పేదలపై పన్నుల భారం తగ్గిస్తాం
ప్రజాశక్తి-కురబలకోట : తంబల్లపల్లె నియోజకవర్గంలో వైసిపి నాయకులు చేస్తున్న అవినీతి అక్రమాల భరతం పడతామనిటిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర 41వ రోజుకు చేరుకుంది. శనివారం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోటలోని నందిరెడ్డివారిపల్లె చేనేతనగర్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర నందిరెడ్డివారిపల్లె, తట్టివారిపల్లె, అంగళ్లు, దొమ్మనబావి, కంటేవారిపల్లె వరకూ పాదయాత్ర సాగింది. 9.05 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర సందర్భంగా ఆయా ప్రాంతాల్లో కురుబలు, కుమ్మరి సామాజిక వర్గాల వారితో మాటామంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాలనలో అందరూ బాధితులేనని తెలిపారు. పెట్రోల్, డీజిల్‌పై వేస్తున్న అసాధారణ పన్నుల వలనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. టిడిపి అధికారలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని తెలిపారు. అడ్డగోలుగా పెంచిన అన్ని పన్నులు, పేద వాడిపై పన్నుల భారం తగ్గిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 6 లక్షల పెన్షన్లు కట్ చేశారని తెలిపారు. ఆఖరికి చెత్త పన్ను కూడా పెన్షన్‌లో కట్ చేసే దారుణమైన ప్రభుత్వం మరొకటి లేదన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే అర్హులైన అందరికీ పెన్షన్లు ఇచ్చి తీరుతామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇండిస్టియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ప్రోత్సహిస్తామని తెలిపారు. శాలివాహన సామాజికవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆదరణ ద్వారా గతంలో వేలాది రూపాయల విలువ చేసే పనిముట్లు అందించామని చెప్పారు. టిడిపి హయాంలో అంగళ్లలో సీఎఫ్సీ భవనం నిర్మించామన్నారు. వారంతా ఒకేచోట ఉండి పని చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక కంటెవారిపల్లెలోనూ సీఎఫ్సీ బిల్డింగ్ నిర్మించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. కుమ్మరుల ఉత్పత్తుల సేల్‌ను అధికారంలోకి రాగానే తాము ప్రమోట్ చేస్తామన్నారు. కురుబల కోసం తొలుత కురుబ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కృషి చేశామన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చాక గొర్రెల మేపుకోవడానికి బీడు భూములు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కురుబల ఆరాధ్య దైవం కనకదాసు జయంతిని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. కురుబ భవనాల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామన్నారు.
నేడు, రేపు యువగళం పాదయాత్రకు విరామం
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో సాగుతోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రస్తుతం నియోజకవర్గం వీడాలంటూ లోకేష్‌కు ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు ముందుగానే నిర్ణయించుకున్నందున తాను స్థానికంగా అన్నమయ్య జిల్లా కంటేవారిపల్లి విడిది కేంద్రంలో ఉండేందుకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని నారా లోకేష్ కోరారు. లోకేష్ పంపిన విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం పైవిధంగా స్పందించింది. ఎన్నికల సంఘాన్ని, చట్టాలను గౌరవించి జిల్లా వీడుతున్నట్లు లోకేష్ ప్రకటించారు. కంటేవారిపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఇప్పటి వరకు నడిచిన దూరం 529.1 కిలోమీటర్లు కాగా 41వ రోజు శనివారం నడిచిన దూరం 9.5 కిలోమీటర్లు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా యువగళం పాదయాత్రకు 12, 13వ తేదీల్లో విరామం ప్రకటించారు. 42వ రోజు పాదయాత్ర 14వ తేదీ కంటేవారిపల్లి నుంచి ప్రారంభమవుతుందని పార్టీ శ్రేణులు ప్రకటించారు.










