Apr 24,2022 09:42

'నువ్విలా', 'గౌెరవం', 'యుద్ధం', 'కొరియర్‌ బాయ్ కళ్యాణ్‌'లో నటించి మంచిపేరు తెచ్చుకున్నారు యామీ గౌతమ్‌. తెలుగులో చేసింది నాలుగే సినిమాలు అయినా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ సినిమాలు చూడని వారు కూడా ఆమెను సులభంగా గుర్తుపట్టేస్తారు. అందుకు కారణం ఫెయిర్‌ అండ్‌ లవ్లీ (గ్లో అండ్‌ లవ్లీ) యాడ్‌. అయితే నటన విషయంలోనూ.. కథల ఎంపికలోనూ యామీది ప్రత్యేకశైలి. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సామాజిక విషయాలపై దృష్టి పెడుతుంటారు యామీ. ఇందులో భాగంగానే అత్యాచార, లైంగికదాడి బాధితులకు అండగా నిలిచే మజ్లీస్‌, పారి(పీపుల్‌ ఎగెనెస్ట్‌ రేప్‌ ఇన్‌ ఇండియా) అనే స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు.. ఈ నేపథ్యంలో ఆమె గురించి మరిన్ని విషయాలు..

 

అత్యాచార బాధితులకు అండగా...



పేరు : యామీ గౌతమ్‌
పుట్టినతేది : 28 నవంబర్‌ 1988
వృత్తి : నటి
నటించిన భాషలు : హిందీ, కన్నడ, తమిళం,
తెలుగు, మలయాళం
జీవిత భాగస్వామి : ఆదిత్య ధర్‌(డైరెక్టర్‌)
తండ్రి : ముఖేష్‌ గౌతమ్‌ (డైరెక్టర్‌)
తల్లి : అంజలీ గౌతమ్‌
సోదరి : సురిలీ గౌతమ్‌ (నటి)


పంజాబ్‌ చండీఘడ్‌లో యామీ గౌతమ్‌ జన్మించారు. మొదట పలు హిందీ టీవీ ధారావాహికల్లో నటించారు. తర్వాత ఫెయిర్‌ అండ్‌ లవ్లీ (గ్లో అండ్‌ లవ్లీ)తో పాటు పలు యాడ్స్‌లోనూ నటించారు. ఆ సమయంలోనే అంటే 2010లో కన్నడ చిత్రం 'ఉల్లాస ఉత్సాహ'లో నటించే అవకాశం రావడంతో సినీరంగ ప్రవేశం చేశారు. అలాగే 2012లో 'విక్కీ డోనర్‌'లో నటించి, హిందీ చిత్రరంగ ప్రవేశం చేశారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో గుర్తింపున్న కథానాయికల్లో ఆమె ఒకరు.
      యామీ గౌతమ్‌ తన కెరీర్‌తోపాటు పలు సామాజిక విషయాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకుగాను మజ్లీస్‌, పారి అనే స్వచ్ఛంద సేవాసంస్థలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. ఈ సంస్థలు అత్యాచార, లైంగికదాడి బాధితులకు అండగా ఉంటాయి. 'అత్యాచారాలకు సంబంధించిన వార్తల గురించి వింటున్నప్పుడు మనసు బాధతో నిండిపోయేది. ఆ మానసిక పరిస్థితి నుంచి బయటికి రావడం చాలా కష్టంగా ఉండేది. పని ఒత్తిడిలో ఆ బాధను తాత్కాలికంగా మరిచిపోయినా.. నా ముందు ఎప్పుడూ ఒక ప్రశ్న మాత్రం నిలుచుండేది. మనం ఏమీ చేయలేమా? అనిపించేది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికే స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయాలనుకున్నా. నా వంతుగా కొన్ని విరాళాలను సేకరించి, నిధుల కొరత నుంచి ఈ సంస్థలను బయటపడేయగలనని నమ్ముతున్నా. ఇది ఆరంభం మాత్రమే. మహిళల భద్రతకు సంబంధించిన మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నా' అంటున్నారు యామీ.
 

                                                     అన్ని భయాలనూ జయించా..

'కొన్ని సంవత్సరాలుగా 'కెరటోసిస్‌ పిలారిస్‌' అనే అరుదైన చర్మవ్యాధితో బాధపడుతున్నాను. ఈ వ్యాధిని దాచడానికి ఎంతో ప్రయత్నించా. కానీ ఇది అందరూ అనుకునేంత భయంకరమైన వ్యాధి కాదు. చాలాసార్లు నా వ్యాధి గురించి చెప్పడానికి ఇబ్బందిపడ్డా. అభిమానులు షూటింగ్‌ సమయంలో చూసినప్పుడు భయమేసేది. నా చర్మాన్ని చూస్తే ఏమనుకుంటారోనని అనుకునేదాన్ని. నా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కొన్నేళ్లు పట్టింది. ప్రస్తుతం ధైర్యం వచ్చింది. అందుకే ఎడిట్‌ చేయని ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నా. ఇప్పుడు ధైర్యంగా అందరికీ చెబుతున్నా. నా మనస్సుకి చాలా ప్రశాంతంగా ఉంది. నా భయాలు, అభద్రతలను జయించినట్లుగా ఉంది' అంటూ కొంతకాలం క్రితం ఆమె సోషల్‌మీడియాలో ఫొటోలను పోస్ట్‌ చేసి, పలువురికి ఆదర్శంగా నిలిచారు.
'మనమీద మనకు అపనమ్మకం ఏర్పడ్డప్పుడు, ఇక వేరే శత్రువు అంటూ అక్కర్లేదు. మనల్ని పూర్తిగా వెనక్కి తీసుకెళ్లే ప్రతికూలశక్తి దానికి ఉంది. మా అమ్మ మాటల బలంతో ఆ ప్రతికూల భావన నుంచి బయటికి రాగలిగాను. అందుకే నా మాట సహాయం కోరి వచ్చే వారికి నువ్వు కచ్చితంగా నెగ్గగలవు, నీలో ఆ శక్తి ఉంది అని ధైర్యం ఇస్తుంటాను' అంటున్నారు యామీ.
 

                                                          ఒకప్పటిలా కాదు..

'కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ ప్రొఫెషనల్‌గా ఎదిగాను. ఏది చేస్తే మంచిదో తెలుసుకోగలిగా. అయితే నాకు వచ్చే అవకాశాలకు, నా ఆలోచనలకు ఎంతో వ్యత్యాసం ఉంది. నాపాత్ర నచ్చకపోయినా కొన్ని సినిమాలు చేయాల్సి వచ్చింది. కెరీర్‌లో ఎత్తుపల్లాలు, విజయాలు, అపజయాలు లేకపోతే మనకు ఏది మంచిదో తెలుసుకోవడం కష్టం. మొదట్లో సినిమా ఫెయిల్‌ అయితే చాలా ఫీల్‌ అయ్యేదాన్ని. కానీ ప్రస్తుతం నా ఆలోచనా విధానం మారింది. ఒకప్పుడు ''ఈ సినిమాలో నా పాత్ర ఏమిటీ?'' అనే వరకే పరిమితమయ్యేదాన్ని.. ఇప్పుడు మాత్రం ''ఈ సినిమాలో నా పాత్ర ఇచ్చే సందేశం ద్వారా సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా?'' అనే కోణంలో ఆలోచిస్తున్నా.. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ''ఉరి ద సర్జికల్‌ స్ట్రైక్‌'' వంటి సూపర్‌ హిట్‌ మూవీని అందించిన దర్శకుడు ఆదిత్యను యామీ పెళ్లాడారు.