ప్రజాశక్తి - విజయవాడ అర్బన్
బెంజిసర్కిల్ వద్ద నివాసం ఉంటున్న విద్యార్థినిపై ముగ్గురు ఉన్మాదులు చేసిన ఘటనను ఖండిస్తూ 19వ డివిజన్‌లోని జార్జిపేట వద్ద ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈసందర్భంగా ఐద్వా ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్షురాలు కె.సరోజ, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పి.కృష్ణ మాట్లాడుతూ ముక్కుపచ్చలారని విద్యార్థినికి మాయమాటలు చెప్పి వంచించి ఆమెను బలాత్కారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. చదువు నిమిత్తం అమ్మమ్మ ఇంట్లో ఉండి స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని ఈవిధంగా చేయడం దారుణమన్నారు. నగరంలో మత్తు పదార్థాలకు బానిసైన వారు ఎక్కువగా ఉన్నారని దీనితో పాటు మద్యం గంజాయి విచ్చలవిడిగా ఉండటం వలన ఇటువంటి అఘాయిత్యాలకు యువత పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని మరలా ఇటువంటి సంఘటనలు జరుగకుండా చూడాలని కోరారు. నేరాలు చేసిన వారు కొంత మంది నాయకుల అండదండలతో బయట స్వేఛ్చగా తిరుగుతున్నారని అది సమాజానికి మంచిది కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మద్య నిషేదం పెట్టి మహిళలకు రక్షణ కల్పించడంలో బాద్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి శాంతి, 19వ డివిజన్ కార్యదర్శి రత్నమాల, డివైఎఫ్‌ఐ నాయకులు కృష్ణ , రవి. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బాబి, పౌర సంక్షేమ సంఘం నాయకులు మురహరి, జి.కె. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










