Mar 03,2023 20:42

రాజంపేట : బహుమతులు అందజేస్తున్న జిల్లా అటవీ అధికారి వివేక్‌

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : అటవీ సంపదను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్‌ అన్నారు. ప్రపంచ వైల్డ్‌ దినోత్సవాన్ని పురష్కరించుకొని శుక్రవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్‌ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అడవి కన్న తల్లి లాంటిదని, అడవిని సురక్షితంగా సంరక్షించుకోవాలని తెలిపారు. అడవికి నిప్పు పెట్టడం వలన వృక్ష సంపదతో పాటు వన్యమృగాలు మృత్యువాత పడతాయని తెలిపారు. అడవులు నశిస్తే మానవ మనుగడకే ప్రమాదమన్నారు. అనంతరం జిల్లా నలుమూలల నుండి వచ్చిన 21 మంది విద్యార్థులకు ఆయన బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రాజంపేట రేంజ్‌ అధికారి నారాయణతో పాటు జిల్లాలోని రేంజ్‌ అధికారులు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. వాల్మీకిపురం: వన్యప్రాణులు మానవ మనుగడకు ఎంతో అవసరమని, వన్యప్రాణులను కాపాడుకోవడం మనందరి బాధ్యతని జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు ప్రభుచరణ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న జంతువులు, మొక్కలపైన అవగాహన పెంచడానికి, వాటిని రక్షించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మనం పీల్చే గాలి, తినే ఆహారం, మనం ఉపయోగించే శక్తి వంటి అనేక ఇతర ప్రయోజనాల కోసం మొక్కలు, జంతువులపై ఆధారపడి ఉన్నామని, మనకు అవసరమైన పదార్థాలన్నీ ప్రకృతి నుండే పొందుతున్నాయన్నారు. రాయచోటి: వన్య ప్రాణులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సంబేపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి అన్నారు. సంబేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్య ప్రాణులు, మొక్కల మనుగడతోనే మానవాళి మనుగడ సాధ్యమన్నారు. లక్షలాదిమంది తమ జీవనోపాధి, ఆర్థిక అవసరాలకు ప్రకృతిపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. వన్యప్రాణులు మనకు ఆహారం, ఇంధనం, ఔషధాలు, గృహపోకరణాలు, వస్త్రాలు, వినోదం మొదలైనవి అందిస్తున్నాయన్నారు. వన్య జీవులను సంరక్షించడానికి అడవులను నరకడం, వేటాడటం, నిప్పు పెట్టడం, పోడు వ్యవసాయం వంటి కార్యకలాపాలను ఆపాలన్నారు. ప్రకృతితో మన సంబంధాన్ని స్నేహపూరితంగా మార్చుకోవాలని తెలిపారు. జిల్లా సైన్స్‌ అధికారి మార్ల ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందఠంగా 'వన్యప్రాణుల సంరక్షణ కోసం భాగస్వామ్యాలు' అనే ఇతివృత్తాన్ని నిర్ణయించారన్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం విద్యార్థులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ విద్యార్థులు వన్యప్రాణుల ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించాలన్నారు. వాటి సంరక్షణ గురించి ప్రజలను చైతన్య పరచాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 65 జీవ జాతులు ముప్పు వాటిల్లిన జాతులుగా గుర్తించబడ్డాయన్నారు. అందులో 22 మొక్క జాతులు, 19 పక్షి జాతులు, 10 క్షీరదాలు, 12 చేప జాతులు, రెండు సరిసురుపాల జాతులు ఉన్నాయన్నారు. మనం వీటిని సంరక్షించకపోతే సమీప భవిష్యత్తులో ఇవి మనకు కనిపించవు అన్నారు. అనంతరం విద్యార్థులతో వన్యప్రాణి సంరక్షణ ప్రతిజ్ఞను చేయించారు. వన్యప్రాపాణి సంరక్షణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్‌, వకృత్వ పోటీలను నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.