Jan 29,2022 08:16
  • బిజెపి పాలిత రాష్ట్రాలైన బీహార్‌, యుపి, ఉత్తరాఖండ్‌ల నిర్వాకం

కార్పొరేట్లు అడిగిందే తడువు..ప్రాజెక్టులే కాదు. పచ్చని అడవులను అప్పగించటానికి మోడీ సర్కార్‌ సన్నద్ధమైపోతోంది. సంపన్నులు కోరుకున్న విధంగా చట్టాలను చుట్టాలుగా మార్చేయటానికి వెనుకాడటంలేదు. అటవీసంపదపైనే ఆధారపడి బతుకుతున్న గిరిజనం హక్కులకు పాతరేస్తోందని పర్యావరణవేత్తలు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. కేంద్రం,ఇటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలు అభివృద్ధిని గాలికొదిలేసి, ఓట్లరాజకీయాలకే పరిమితమవుతున్నాయనటానికి తాజా నివేదికలే సాక్ష్యం..

2021.. నవంబర్‌ 15... మధ్యప్రదేశ్‌.. భోపాల్‌లో జనజాతీయ గౌరవ్‌ దివస్‌...
గిరిజన వీరుడు బిర్సా ముండా జయంతి సందర్భమది..
'గత ప్రభుత్వాలు దేశంలోని గిరిజనులకు సరైన హక్కులు కల్పించలేదు. మేం వారికి అండగా నిలుస్తాం'. ప్రధాని మోడీ


న్యూఢిల్లీ : బిజెపి ప్రభుత్వం ఏ అంశాన్ని ప్రస్తావించినా...దాని వెనుక ఓటు రాజకీయం దాగి ఉంటోంది. ఇటీవల నేతాజీ సుభాశ్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని ప్రతిష్టించి, ప్రధాని మోడీ ఉపన్యసించారు.వాస్తవానికి ఏడేండ్ల కింద అధికారంలోకి రావటానికి నేతాజీ మస్టరీ తేల్చుతామన్నారు..కానీ ఇంతవరకూ అతిగతీలేదు. తాజాగా గిరిజనుల హక్కుల విషయంలోనూ మోడీ అలానే వ్యవహరిస్తున్నారని తాజా నివేదికలు ధ్రువీకరిస్తున్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, బిజెపి పాలిత రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాల హామీలు మాటలకే పరిమితన్న విషయం మరోసారి స్పష్టమైంది. అయితే, కేంద్రంలోని మోడీ సర్కారు, రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు తమ పాలనలో గిరిజనులకు హక్కులు కల్పించలేదన్న విషయం సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి అందిన సమాచార ఆధారంగా తెలుస్తున్నది.
 

                                                        అటవీ హక్కుల చట్టం(ఎఫ్‌ఆర్‌ఏ)

    షెడ్యూల్డ్‌ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, 2006 అమలులోకి వచ్చి 15 ఏండ్లు అవుతున్నది. సాధారణంగా దీనిని అటవీ హక్కుల చట్టం 2006 (ఎఫ్‌ఆర్‌ఎ) అని కూడా అంటారు. అయినప్పటికీ దేశంలోని అడవులలో, చుట్టుపక్కల నివసించే షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్టిీ), ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు (ఒటిఎఫ్‌డి) ఈ చారిత్రాత్మక చట్టం కింద ఇంకా అర్హతలు పొందలేదు. అయితే, ఎఫ్‌ఆర్‌ఎ కింద ఎస్టీ, ఒటిఎఫ్‌డి లకు వారి హక్కులను అందించే విషయంలో బిజెపియేతర రాష్ట్రాలు చక్కని ప్రతిభను కనబర్చాయి. అయితే, బిజెపి పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఇది ఆశాజనకంగా లేదు. ఇక జమ్మూకాశ్మీర్‌లో ఎఫ్‌ఆర్‌ఏ చట్టం నత్తతో పోటీ పడుతూ నడుస్తున్నది.
 

                                             పదిశాతం మంది కూడా ప్రయోజనాలు పొందలేదు

ఎఫ్‌ఆర్‌ఎ ఉపోద్ఘాతం ప్రకారం అటవీ-నివాస షెడ్యూల్డ్‌ తెగలు (ఎఫ్‌డిఎస్‌టి) మరియు ఓటీఎఫ్‌డీ లకు అనుకూలంగా అటవీ హక్కులను గుర్తించి వారికి అప్పగించడానికి చట్టం రూపొందించబడింది. వారు తరతరాలుగా అడవులలో నివసిస్తున్నారు. కానీ, వారి హక్కులు మాత్రం నమోదు కాకపోవడం గమనార్హం. 2006, డిసెంబర్‌ 29న రాష్ట్రపతి నుంచి ఎఫ్‌ఆర్‌ఎ ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా ఈ చట్టం ప్రకారం ఉద్దేశించిన లబ్దిదారులలో పది శాతం మంది కూడా తమ ప్రయోజనాలను పొందలేదని వివిధ అధ్యయనాలు తెలుపుతున్నాయి.గతనెల 15న ఒడిశాకు చెందిన పార్లమెంటు సభ్యులు (రాజ్యసభ) బిజూ జనతాదళ్‌ (బిజెడి) సీనియర్‌ నాయకులు డాక్టర్‌ సస్మిత్‌ పాత్ర, జాతీయ స్థాయిలో ఎఫ్‌ఆర్‌ఏ అమలు గురించి గత మూడేండ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి వివరాలను కోరారు. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు సమాచారాన్ని అందించారు.
 

                                                బీహార్‌, యుపి, ఉత్తరాఖండ్‌లు అధ్వానం

కేంద్ర మంత్రిత్వ శాఖ అందించిన వివరాల ప్రకారం.. 20 రాష్ట్రాల జాబితాలో ఒడిశా రాష్ట్రం ఎఫ్‌ఆర్‌ఎ కింద దాదాపు 4.50 లక్షలకు పైగా టైటిల్‌లను పంపిణీ చేసింది. ఇందులో దాదాపు 4,43,686 మంది వ్యక్తులు వ్యక్తిగత అటవీ హక్కులు (ఐఎఫ్‌ఆర్‌), 6649 కమ్యూనిటీ ఫారెస్ట్‌ రైట్స్‌ (సీఎఫ్‌ఆర్‌) క్లెయిమ్‌లను వివిధ సంఘాల ద్వారా స్వీకరించారు. దేశంలో ఒడిశా చక్కటి ప్రతిభను కనబర్చింది. అయితే, ఎఫ్‌ఆర్‌ఏ అమలు విషయంలో బీహార్‌, యూపీ, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు అధ్వాన్నంగా ఉన్నాయి. బీహార్‌ తన ప్రజలకు మార్చి 31, 2019 నుంచి ఆగస్టు 31, 2021 వరకు 121 ఐఎఫ్‌ఆర్‌ టైటిళ్లను అందించింది. ఇక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీ, ఉత్తరాఖండ్‌లలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. యూపీలో కేవలం 18,910 మంది వ్యక్తులకు ఎఫ్‌ఆర్‌ఏ కింద హక్కులు అందాయి. అయితే, పైన పేర్కొన్న కాలం వ్యవధిలో యూపీలోని 75 జిల్లాల్లో 861 సీఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌లు మాత్రమే నిర్ణయించబడ్డాయి. ఉత్తరాఖండ్‌లో ఐఎప్‌ఆర్‌ క్లెయిమ్‌లు 157 మాత్రమే ఖరారు అయ్యాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో మార్చి 31, 2019 నుంచి ఆగస్టు 31, 2021 వరకు వరుసగా 164 ఐఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌లు, 65 సీఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌లు మాత్రమే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడులో గత మూడేండ్లలో ఎఫ్‌ఆర్‌ఏ కింద కేవలం 8144 కుటుంబాలు మాత్రమే లబ్ది పొందాయి. 450 కంటే ఎక్కువ సీఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌లు నిర్ణయించబడపోవడం గమనార్హం.
 

                                                జమ్మూకాశ్మీర్‌లో ఎఫ్‌ఆర్‌ఏ అమలు పేలవం

రాజ్యాంగంలో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఎఫ్‌ఆర్‌ఏ జమ్మూకాశ్మీర్‌కు విస్తరించబడింది. జమ్మూకాశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం, 2019 ప్రకారం.. తక్షణమే అమలులోకి వచ్చేలా చట్టాన్ని రూపొందించడానికి బదులుగా, ఈ చట్టాన్ని గ్రౌండ్‌ లెవెల్‌లో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వానికి ఒక ఏడాది కంటే ఎక్కువ సమయం పట్టింది. అయితే, కేంద్రం అందించిన సమాచారంలో జమ్మూకాశ్మీర్‌ గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. సమాచార హక్కు చట్టం, 2005 (ఆర్టీఐ చట్టం) కింద పొందిన సమాచారం ప్రకారం, ఉదంపూర్‌, బుద్గాం జిల్లాల నుంచి కేవలం 10 కమ్యూనిటీ క్లెయిమ్‌లు (రెండు జిల్లాల్లో ఐదు చొప్పున) మాత్రమే సంబంధిత జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయించాయి. మరో 18 జిల్లాల నుంచి రెండు నెలలు గడిచినా సమాచారం అందలేదు. మోడీ సర్కారుకు గిరిజనులపై ప్రేమ వట్టిదేనన్న విషయం ఎఫ్‌ఆర్‌ఏ చట్టం అమలు తీరుతో అర్థమవుతున్నదని గిరిజన సంఘాల నాయకులు ఆరోపించారు.

                                                           బిజెపియేతర రాష్ట్రాలు భేష్‌

ఎఫ్‌ఆర్‌ఏ అమలులో బిజెపియేత రాష్ట్రాలు చక్కటి పనితీరును కనబర్చినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం తెలస్తున్నది. ఇందులో ఒడిశా మొదటిస్థానంలో ఉండగా, కాంగ్రెస్‌ పాలిత ఛత్తీస్‌గఢ్‌ రెండో స్థానంలో నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్చి 31, 2019 నుంచి ఆగస్టు 31, 2021 మధ్యకాలంలో దాదాపు 4,23,218 ఐఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌లు, 21,967 సీఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌లను నిర్ణయించింది. ఒడిశాలో 4,43,686 మంది వ్యక్తులకు ఎఫ్‌ఆర్‌ఏ కింద హక్కులు అందించబడ్డాయి. 21,967 సీఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌లు నిర్ణయించబడ్డాయి. మహారాష్ట్ర వరుసగా 1,72,116 ఐఎఫ్‌ఆర్‌, 7084 సీఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌లను నిర్ణయించింది. సీఎఫ్‌ఆర్‌ టైటిల్స్‌ ఇవ్వడంలో ఒడిశా కంటే మహారాష్ట్ర ముందున్నది. మమత పాలనలో పశ్చిమ బెంగాల్‌లో ఎఫ్‌ఆర్‌ఏ కింద 45,130 మంది వ్యక్తులకు టైటిల్స్‌ అందగా, 686 కమ్యూనిటీ క్లెయిమ్‌లు మార్చి 31, 2019 నుంచి ఆగస్టు 31, 2021 మధ్య నిర్ణయించబడ్డాయి. గుజరాత్‌లో కేవలం 95,363 మంది వ్యక్తులు మాత్రమే ఎఫ్‌ఆర్‌ఏ కింద హక్కులను పొందారు. 3887 సీఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌లు నిర్ణయించబడ్డాయి.