Feb 22,2023 21:01

అనంతపురంలో నామినేషన్‌ వేసేందుకు ర్యాలీగా వెళుతున్న పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు

కడప ప్రతినిధి
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు అట్టహాసంగా దాఖలయ్యాయి. ఈ నెల 13 నుంచి 23వ తేదీతో నామినేషన్లకు గడువు ముగియనుంది. బుధవారం నామినేషన్లు జోరు వెల్లువెత్తింది. నామినేషన్ల దాఖలు గడువు ముగింపునకు ఒక్కరోజు సమయం ఉండగానే కడప, అనంతపురం కలెక్టరేట్లలో స్థానిక సంస్థల, పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పలువురు తమ అనుచర గణాలతో కలిసి పోటాపోటీగా దాఖలు చేశారు. కడప, అనంతపురం కలెక్టరేట్లలో సందడి వాతావరణం నెలకొంది. నామినేషన్ల దాఖలు చేయడానికి ఆశావహులు పెద్దఎత్తున కదలిన నేపథ్యంలో కలెక్టరేట్ల ఎదుట భారీగా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల అధిక సంఖ్యలో ఉన్న సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు అనంతపురం కలెక్టరేట్‌లో నామినేషన్లు దాఖలు చేయడానికి మొగ్గు చూపించినట్లు కనిపిస్తోంది. పట్టభద్ర పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ పోతుల నాగరాజు, టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, వైసిపి అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి సహా పలువురు స్వతంత్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు కత్తి నరసింహారెడ్డి, ఎ.రామచంద్రారెడ్డి, ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, భారీ అనుచరులతో కలిసి నామినేషన్లు దాఖలు చేశారు. కడప కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి నామినేషన్‌ చేశారు. జిల్లాలో వైసిపికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గణనీయ సంఖ్యలో ఉండడం, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు చేతివేళ్ల మీద లెక్కబెట్టాల్సిన పరిమిత సంఖ్యలో అభ్యర్థులు గెలిచిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఆశావహులు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయడానికి ముందుకురాని నేపథ్యం నెలకొంది. వైసిపి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దాదాపుగా ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈలెక్కన పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల మధ్యే ప్రధానంగా ఎన్నికల్లో పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నట్లు పరిశీలకుల అంచనా.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పిఆర్‌ నామినేషన్‌ దాఖలు
కడప: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్దిగా మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారి జెసి సాయికాంత్‌ వర్మ నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. రామసుబ్బారెడ్డి వెంట ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, వైసిపి జిల్లా అధ్యక్షులు సురేష్‌ బాబు, బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా ఉన్నారు. అంతకు ముందు శిల్పారామంలో ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, వైసిపి కడప, అన్నమయ్య జిల్లాల అధ్యక్షులు సురేష్‌ బాబు, శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాసులు, సుధీర్‌రెడ్డి, డాక్టర్‌ సుధా, జిల్లాలోని జడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ప్రశ్నించే గొంతుకలను చట్టసభలకు పంపుదాం
అనంతపురం ప్రతినిధి: ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను చట్టసభలకు పంపిచాలని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు అన్నారు. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట తప్పను.. మడమ తిప్పను.. అన్న ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్మో హన్‌రెడ్డి, ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్కమాటను నిలుపుకోలేదని చెప్పారు. ఆయన మాటా తప్పాడు...మడమా తిప్పాడూ అని విమర్శించారు. చట్ట సభల్లో ప్రజా సమస్యలపై ఇప్పుడు చర్చ జరగడం లేదని విచారం వ్యక్తం చేశారు. పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించి మండలికి పంపాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించే గొంతుకలను మండలికి పంపడం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించగలన్నారు. ఎమ్మెల్సీ సాబ్జి మాట్లాడుతూ మండలి ఎన్నికలు కౌరవులు, పాండవులకు మధ్య జరుగుతున్న పోరు అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిలదీసే పిడిఎఫ్‌ అభ్యర్థులను ఓడించేందుకు అధికారపార్టీ సాయశక్తులను ఒడ్డుతోందని చెప్పారు. పిడిఎఫ్‌ పట్టభద్రుల అభ్యర్థి పోతుల నాగరాజు మాట్లాడుతూ ఇన్ని ప్రజాసంఘాలు వచ్చి తమ అభ్యర్థిత్వాన్ని బలపరచడంతోనే తమకు నైతిక విజయం లభించినట్టయిందన్నారు. కొంత మంది అధికారులను ఇక్కడికి పంపి ప్రలోభ పెట్టే ప్రయత్నాలు ఇప్పటికే చేస్తోందన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి విస్మరించారని తెలిపారు. సిపిఎస్‌పైనా, పిఆర్‌సిపైనా మండలిలో గొంతెత్తామని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఈ సమస్యలపై పోరాటాన్ని సాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఎఐటియుసి, యుటిఎఫ్‌, ఎస్టీయు, ఐద్వా, ఎపి రైతు సంఘం, వ్వవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్‌ఐ, ఎఐవైఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐవైఎఫ్‌, బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.