ఆటోరంగ కార్మికులను ఆదుకోవాలి
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: సొంతకాళ్లపై నిలబడి బతుకుతున్న ఆటోరంగ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని ఆటో నగర్ యూనియన్ అధ్యక్షుడు గోపి నాయుడు డిమాండ్ చేశారు. పట్టణంలో స్థానిక ఆటోనగర్ యూనియన్ కార్యాలయంలో ఆటో కార్మికుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపి నాయుడు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా సుమారు 500 కుటుంబాలు ఆటో మెకానిక్ కార్మికులుగా జీవనం సాగిస్తున్నాయని, ఏ ఒక్క కుటుం బానికీ సొంతిళ్లు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలుగా పాలకులు మారు తున్నా సొంతింటి కల నెరవేరుస్తామని హామీలు ఇస్తున్నారే తప్ప ఆచరణలో మాత్రం పెట్టడం లేదని వాపోయారు. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు తమవని, రాజకీయ నాయకులు ఓటు బ్యాంకుగా తమను వాడుకుంటుండటం బాధాకరమన్నారు.
స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మాధుసూదన్ రెడ్డి దష్టికి ఆటో రంగ కార్మికుల సమస్యలను తీసుకెళ్లామని, ఆయన పెద్ద మనసుతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మోహన్, ముని గోపాల్, సాదిక్ బేగ్, సుబ్రమణ్యం, తిరుపాల్ రెడ్డి, గోపాల్, మీర్జాన్ బేగ్ చిరంజీవులు, చెంగల్ రాయలు, మునికష్ణ, గోపి, మని నాయుడు, మహేష్ పాల్గొన్నారు.










