Dec 19,2022 22:12

సమావేశంలో మాట్లాడుతున్న ఇఎస్‌ వెంకటేష్‌

ప్రజాశక్తి-హిందూపురం : ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. ఎపి ఆటో అండ్‌ ట్రాలీ వర్కర్స్‌ యూనియన్‌ పట్టణ మహాసభ సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆటో కార్మికులు పట్టణంలోని సూగురు ఆంజినేయ స్వామి ఆలయం నుంచి సాయిరాం ఫంక్షన్‌ హాలు వరకు ఏర్పాటు చేసిన ఆటో ర్యాలీని సిఐటియు జిల్లా కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జెడ్పీ శ్రీనివాసులు, ఈఎస్‌ వెంకటేష్‌ మాట్లాడుతు 15 సంవత్సరాలు దాటిన వాహనాలకు ఫిట్నెస్‌ పేరుతో వసూలు చేస్తున్న రూ. 4వేల చలానా వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో కోట్ల మంది ఉపాధి పొందుతున్న ట్రాన్స్‌ పోర్ట్‌ రంగంలో ఎంవి యాక్ట్‌ సవరణ చట్టం ద్వారా ప్రైవేటు, విదేశీ కంపెనీలైన ఓలా, ఊబర్‌ వంటి వాటికి అవకాశం కల్పించి ఆయిల్‌, గ్యాస్‌ నిక్షేపాలను బడా పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారన్నారు. స్పెర్‌ పార్ట్స్‌ ధరలు, ఇన్సూరెన్స్‌ రేట్లు విపరీతంగా పెంచడంతో ఆటోలకు కిరాయిలు లేక కంతులు కట్టలేక వాహనాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటువంటి పరిస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్‌పోర్టు రంగాన్ని ఆదుకోవడంలో విఫలం చెందాయన్నారు. ఆటోల కొనుగోలుకు బ్యాంక్‌ ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చెసి, ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్‌ ద్వారా లోన్లు మంజూరు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న ప్రతి డ్రైవర్‌కు వాహన మిత్ర పథకం వర్తింప జేయలన్నారు. ట్రాన్స్‌పోర్టు రంగంలో పనిచేసే కార్మికులందరు సంఘటితమై పెనుగొండలో జరిగే 2వ జిల్లా మహాసభల్లో వీటన్నిటిపై చర్చించి, ఇప్పటివరకు జరిగిన ఉద్యమాలను సమీక్షించి, భవిష్యత్తు ఉద్యమాలకు బాటలు వేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప, అధ్యక్షులు జగదీష్‌, కోశాధికారి రామకష్ణ, పెద్ద ఎత్తున ఆటో కార్మికులు పాల్గొన్నారు.
పట్టణ కమిటీ ఎన్నిక : హిందూపురం ఆటో యూనియన్‌ కమిటీని ఈసందర్భంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అత్తర్‌ బాబా, కార్యదర్శిగా రామకృష్ణ, కోశాధికారిగా అంజి, ఉపాధ్యక్షులుగా అతవుల్లా, షాదిక్‌, ఎజాజ్‌, మంజు, సహాయ కార్యదర్శులుగా సుధీర్‌, సలీం, నాగరాజు శ్రీరంగ రాజుపల్లి, నాగరాజు కోటిపి, కమిటీ సభ్యులుగా షాహిద్‌, బాబురెడ్డి, ఇర్ఫాన్‌, సంజీవప్ప, సురేష్‌, రవి, ఆదినారాయణప్ప, నవీన్‌ కుమార్‌ అంజన్‌ రావు, బాలు, అతిక్‌ను ఎన్నుకున్నారు.