Dec 27,2022 22:26

మహాసభలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌. వెంకటేష్‌

ప్రజాశక్తి -పెనుకొండ : ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం పట్టణంలో ట్రాన్స్‌పోర్ట్‌రంగ 2వ జిల్లా మహాసభలను నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియు కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించి వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా మహాసభలో నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ఆర్థికవిధానాల వల్ల తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గించాలన్నారు. 15సంవత్సరాలు దాటిన వాహనాలకు ఫిట్నెస్‌ పేరుతో వసూలు చేస్తున్న రూ 4వేల చలానా వెంటనే రద్దు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్‌పోర్టు రంగాన్ని ఆదుకోవడంలో విఫలం చెందాయన్నారు. ఆటోల కొనుగోలుకు బ్యాంక్‌ ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేసి, ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్‌ ద్వారా లోన్లు మంజూరు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న ప్రతి డ్రైవరుకు వాహన మిత్ర పథకం వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ట్రాన్స్‌పోర్టు రంగంలో పనిచేసే కార్మికులందరు సంఘటితమై ఉద్యమాలను ఉధృతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హరి, ఆటో యూనియన్‌ జిల్లా రాష్ట్ర కమిటీ సభ్యులు రఫీ, రామకృష్ణ , సిఐటియు మండల కార్యదర్శి బాబావల్లి, జిల్లా అధ్యక్షులు గౌస్‌ లాజం, జిల్లా ప్రధాన కార్యదర్శి బాబా, జిల్లా కోశాధికారి ఆదిరెడ్డి, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, కుల్లాయప్ప, రంగన్న, సహాయ కార్యదర్శి రఫీ ,అయాజ్‌ ,రామ్మోహన్‌, 27 మంది జిల్లా కమిటీ సభ్యులతో పాటు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రవీణ్‌ కుమార్‌, బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.