Mar 18,2022 08:02

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ సిఫార్సులను తక్షణం అమలు చేయాలని పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు డిమాండ్‌ చేశారు. శాసనమండలిలో 2022-23 వార్షిక బడ్జెట్‌పై గురువారం జరిగిన చర్చ సందర్భంగా వారు వేతన సవరణ అంశాన్ని ప్రస్తావించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, ఫించనర్లకు న్యాయం జరగాలంటే అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ సిఫార్సు ప్రకారం 27 శాతం ఫిట్‌మెంట్‌తో పాటు నివేదికలోని ఇతర అంశాలను అమలు చేయడమే మార్గమని అన్నారు. 11వ పిఆర్‌సిని 2018 ఆగస్టు ఒకటి నుంచి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, రాజస్థాన్‌, పంజాబ్‌ మాదిరిగా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ సిస్టమ్‌ను (సిపిఎస్‌) మన రాష్ట్రంలో కూడా రద్దు చేయాలన్నారు.
    ఎన్నికలకు ముందు సిఎం వైఎస్‌ జగన్‌ సిపిఎస్‌ను వారం రోజులలో రద్దు చేస్తామని హామీ ఇచ్చినా, బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పింఛన్‌ను పెంచాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాలన్నారు. నూతన విద్యా విధానంలో భాగంగా 3, 4, 5 తరగతులను హస్కూళ్లలో విలీనం చేయడం నష్టదాయకమని, అదే సమయంలో ఉన్నత పాఠశాలలో ప్లస్‌ టూను అమలు చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మధ్యాహ్న భోజన పథకంలో ప్రాథమిక మెనూ చార్జీలను పెంచాల్సి ఉందని చెప్పారు.
 

                                                         భారం రూ.3,180 కోట్లే : సాబ్జీ

అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ సిఫార్సులను అమలు చేస్తే ప్రభుత్వంపై రూ.3,180 కోట్లే అదనపు భారం పడుతుందని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ తెలిపారు. 23 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేస్తేనే రూ.10,147 కోట్ల భారం పడుతుందని ఆర్థికశాఖ అధికారులు లెక్కలు చూపించడం శోచనీయమన్నారు. ఖాళీగా ఉన్న 46,553 ఉపాధ్యాయ, ఇతర శాఖలలో 2.41 లక్షల పోస్టుల భర్తీకి బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడం గర్హనీయమన్నారు. స్కీమ్‌ వర్కర్లకు కనీసం 20 వేల వేతనం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ పాలిటెక్నిక్‌తోపాటు కస్తూర్బా పాఠశాలలు, యూనివర్సిటీ అధ్యాపకుల వేతనాల పెంపునకు సంబంధించిన జిఓలను అమలు చేయాలన్నారు. ప్రాథమిక తరగతుల విలీనాన్ని నిలిపివేయాలని, మిడ్‌ డే మీల్స్‌, ఇతర స్కీమ్‌ వర్కర్ల వేతనాలను పెంచాలని కోరారు.