Mar 19,2022 07:35
  • ఆదోని మున్సిపల్‌ అధికారుల వింత వైఖరి

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : పన్ను వసూళ్ల కోసం రాష్ట్రప్రభుత్వం బరితెగిస్తోంది. చెత్త పన్ను కట్టలేదని మొన్న కర్నూలులో దుకాణాల ఎదుట చెత్త వేశారు. ఇంటి, కుళాయి పన్ను కట్టకుంటే ఇంట్లోని సామానులు జప్తు చేసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిన్న హెచ్చరికలు జారీ చేశారు. ఆస్తి పన్ను కట్టలేదని నేడు కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీలో దాదాపు 1500 ఇళ్లకు కుళాయి కనెక్షన్లను తొలగించారు. పన్ను వసూళ్ల కోసం అధికారులు అవలంభిస్తున్న వింత వైఖరితో ప్రజలు విస్తుపోతున్నారు.
    కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీలో మొత్తం 33,232 అసెస్‌మెంట్లు ఉన్నాయి. వాటికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలోపు రూ.15 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ రూ.9.5 కోట్లు వసూలు చేశారు. పన్ను కట్టని 5,226 మందికి డిమాండ్‌ నోటీసులు అందించారు. వీరిలో 1500 మందికి కుళాయి కనెక్షన్లు తొలగించారు. గత్యంతరం లేక వినియోగదారులు ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. పన్ను కట్టిన తర్వాతే కనెక్షన్లను పునరుద్ధరిస్తున్నారు. మార్చి 31 వరకూ పన్ను చెల్లించేందుకు గడువు ఉన్నా ఫిబ్రవరి నుంచే కనెక్షన్ల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. డోన్‌ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూలుకు అధికారులు మరో వింత వైఖరి అవలంభిస్తున్నారు. ఆస్తి పన్ను కట్టకపోతే పెన్షన్‌, రేషన్‌కార్డు, జగనన్న చేదోడు, ఆసరా వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోతాయని సచివాలయ సిబ్బంది బెదిరింపులకు పాల్పడు తున్నారు. డోన్‌లో 15,820 అసెస్‌మెంట్లు ఉన్నాయి. వాటికి సంబంధించి పాత బకాయిలు రూ.1.78 కోట్లు, ఈ ఏడాది ఆస్తి పన్ను బకాయిలు రూ.2.05 కోట్లు మొత్తం కలిపి రూ.3.83 కోట్లు ఉన్నాయి. ఇప్పటి వరకూ రూ.1.20కోట్లు వసూలైంది.

                                                                 పన్ను వసూలు చేసేందుకే..

ఆస్తి పన్ను కట్టకపోతే నీళ్లు బంద్‌

ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకే కుళాయి కనెక్షన్లను తొలగిస్తున్నాం. చాలా మంది కనెక్షన్‌ తొలగిస్తామని చెప్పిన వెంటనే పన్ను చెల్లిస్తున్నారు. వెంటనే వారికి కుళాయి కనెక్షన్‌ పునరుద్ధరిస్తున్నాం.
                                                           - ఆర్‌జివి కృష్ణ, ఆదోని మున్సిపల్‌ కమిషనర్‌