Jul 12,2021 11:07

గౌహతి : అస్సాం వీరప్పన్‌గా పిలవబడే మంగిన్‌ ఖల్హాన్‌ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కలప అక్రమరవాణాకు పాల్పడే ఈ ముఠాలో చెలరేగిన అంతర్గత ఘర్షణలతో కార్యకర్తలే అతన్ని కాల్చి చంపినట్లు వెల్లడించారు. అస్సాంలోని దక్షిణ హిల్స్‌ ప్రాంతమైన కర్బీ ఆంగ్లాంగ్‌ జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. యునైటెడ్‌ పీపుల్స్‌ రివల్యూషనరీ ఫ్రంట్‌ (యుపిఆర్‌ఎఫ్‌) కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మార్టిన్‌ గైట్‌ గత అక్టోబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. అనంతరం ఈ సంస్థ లొంగిపోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఫ్రంట్‌కు తానే చీఫ్‌ నంటూ మంగిన్‌ ఖల్హాన్‌ ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణలు తారాస్థాయికి చేరడంతో వారు అతనిపై కాల్పులకు దిగినట్లు పోలీసులు వెల్లడించారు. మంగిన్‌ శరీరమంతా బుల్లెట్లు దూసుకుపోయాయని అన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.