- ప్రచార రథం ప్రారంభోత్సవంలో కలెక్టర్
ప్రజాశక్తి - విజయవాడ : వినియోగదారుల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించి రక్షణ పొందేలా సహకారం అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. ఆసరా (అడ్వకేట్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవేర్నెస్) స్వచ్చంద సంస్థ సహకారంతో వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రచార రథాన్ని నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వినియోదారుల రక్షణ చట్టం-2019పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. వినియోగదారులకు మెరుగైన రక్షణ కల్పించేందుకు నూతన చట్టంలో ఈ-కామర్స్, డైరెక్ట్ సెల్లింగ్, టెలి షాపింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ లావాదేవీలు, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఆథారిటీ ఏర్పాటు వంటి వివాదాల పరిష్కారానికి ఎక్కువ సౌలభ్యం ఉండేలా పొందుపరిచారన్నారు. ఈకార్యక్రమంలో డిఎస్‌ఓ కోమలి పద్మ, ఆసరా స్వచ్చంద సంస్థ చీఫ్ పాట్రన్ హబీబ్ సుల్తాన్ అలీ, స్టేట్ ఈసీ మెంబర్ కోనేరు మధు, జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ కాకాని తరుణ్, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్.శిరీష, కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్ పాల్గొన్నారు.










