ప్రజాశక్తి-సంతనూతలపాడు : మహిళలను లక్షాధికారులను చేస్తామన్న సిఎం జగన్ వారిని బిచ్చగాళ్లను చేయకుంటే ఎంతో మంచిదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రమాదేవి ఎద్దేవా చేశారు. అసమానతలు లేని సమాజం కోసం సిపిఎం చేపట్టిన పోరాటాన్ని అందరూ బలపర్చాలన్నారు. ప్రజారక్షణ భేరి బస్సుయాత్రలో భాగంగా సంతనూతలపాడులో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పిన మోడీ ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి గానీ, మంత్రులకు గానీ కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో 300 మండలాల్లో కరువు ఉంటే కేవలం 103 మండలాలనే కరువు కింద ప్రకటిం చారన్నారు. ఈ మండలాల్లోనూ ఎలాంటి సహాయక చర్యలూ లేవన్నారు. కేంద్రం రాష్ట్రానికి అన్ని రకాలుగా అన్యాయం చేసినా వైసిపి, టిడిడి, జనసేన పార్టీలు ఏమాత్రం ప్రశ్నించకపోగా ఆయనకే భజన చేసే పరిస్థితి వచ్చిందన్నారు. సభకు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు ఎస్‌కె.మాబు అధ్యక్షత వహించారు. సభకు స్థానిక పార్టీ నేత బంకాసుబ్బారావు స్వాగతం పలకగా నెరుసుల వెంకటేశ్వర్లు వందన సమర్పణ చేశారు.
రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు
కొండపి:రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడితే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని సిపిఎం రాష్ట్ర నాయకులు దయా రమాదేవి తెలిపారు. ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర మంగళవారం కొండపికి వచ్చింది. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. తొలుత స్థానిక పెరిదేపి సిపిఎం నాయకులతో పాటు మండలంలోని సిపిఎం నాయకులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ స్థానిక గాందీబొమ్మ సెంటర్ మీదుగా జెండా చెట్టు, ఎన్‌టిఆర్ కూడలి సాగింది. ఎన్‌టిఆర్ కూడలిలో ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన గీతాలు ప్రజల్ని ఆకట్టుకున్నాయి. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో రమాదేవి మాట్లాడుతూ మతోన్మాద బిజెపిని తరిమికొట్టి అసమానతలు లేని అభివృద్ధిని సాధిద్దామని పిలుపునిచ్చారు. సభకు సిపిఎం నాయకులు కెజి.మస్తాన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి.శ్రీనివాసులు,వి.బాలకోటయ్య, బి.రఘురాం, టంగుటూరు మండల కార్యదర్శి వి.మోజస్, శింగరాయకొండ నాయకుడు టి.రాము, కొండపి మండల నాయకులు మల్లెల కొండయ్య, అంగలకుర్తి బ్రహ్మయ్య, ఎం.పెద్ద పేతురు, ముప్పరాజు బ్రహ్మయ్య పాల్గొన్నారు.
వ్యవసాయాన్ని నాశనం చేస్తున్న బిజెపి
శింగరాయకొండ: దేశంలో వ్యవసాయ రంగాన్ని బిజెపి నాశనం చేస్తూ పోతుంటే రాష్ట్రంలో అధికార వైసిపి ప్రతిపక్ష టీడీపీలు నోరు మెదపకుండా ఉంటున్నాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర జరుగుమల్లి మండలం, చిరుకూరపాడుకు చేరుకుంది. యాత్రకు సిపిఎం రాష్ట్ర నాయకులు వి.కృష్ణయ్య, కె.ఉమామహేశ్వరరావు, ఎం.భాస్కరయ్య, డి.రమాదేవి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పూనాటి ఆంజనేయులు, జివి.కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, జి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం జరుగుమల్లి మండలం చిరుకూరపాడు సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో వి.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో వర్షపు నీటితోనే వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సాగునీరు లేక కరువుతో అల్లాడిపోతుంటే అధికార వైసీపీకి పట్టడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వేశపోగు మోజెస్, కెజి.మస్తాన్, టంగుటూరు రాము, ఎం. రమేష్, రఘురాం, బాలకోటయ్య, సిహెచ్.వినోద్,శివయ్య, సుబ్బారావు, మీరాసా, కొండబత్తిన శీను, జి.అంకయ్య, పడిదపు రవికుమార్, బాబూరావు, రవి పాల్గొన్నారు.
అసమానతలు లేని అభివృద్ధే థ్యేయం
మేదరమెట్ల: అసమానతలు లేని అభివద్ధే థ్యేయంగా ముందుకు నడవాలని మాజీ శాసనసభ్యులు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్ అన్నారు. ప్రజారక్షణ భేరి బస్సుయాత్ర మంగళవారం బాపట్ల జిల్లా, కోరిశపాడు మండలంలోకి వచ్చింది. స్థానిక పార్టీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మేదరమెట్ల సెంటర్‌లో గఫూర్ మాట్లాడుతూ ఈ నెల 15న విజయవాడలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రజలు అధికసంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, ప్రభాకర్‌రెడ్డి, బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్.గంగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, ఉమామహేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శి ఎం.ఆంజనేయులు, ఎం.పెద్దసుబ్బారావు, వై.రవీంద్ర, బొంత దశరథ, కంచర్ల సురేష్ పాల్గొన్నారు.










