శిశిరాక్షస అరణ్యంలో ఎక్కడో ఒకచోట బంగారం ఉన్నదని ప్రచారం సాగుతోంది! అక్కడి సమీప ప్రాంత ప్రజలు ఎప్పటినుంచో దాని గురించి చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు ఎవరూ బంగారాన్ని చూసింది లేదు. అయినా కొంతమంది ప్రజలు రోజూ అడవిలోకి రావడం, బంగారం వెతికే క్రమంలో అడవిలోని చెట్లను నరకడం చేస్తున్నారు. అందువల్ల రానురాను అడవిలోని జంతువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
రోజురోజుకూ పరిస్థితులు శృతిమించడంతో అడవిలోనున్న జంతువులన్నీ కలిసి, రాజైన సింహం నాయకత్వంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. 'ఉందో, లేదో తెలియని బంగారం వల్ల మన అడవి ఆవాసం నాశనమవుతోంది. కనుక ఏదో ఒకటి చేసి, ఈ సమస్యను మనం అధిగమించాలి. లేకపోతే మన మనుగడ ఇబ్బందికరంగా మారుతుంది' అని జంతువులు తీర్మానించుకున్నాయి. వాటన్నింటి లోకి తెలివైన కుందేలు ఒక ఉపాయం సింహానికి చెప్పింది. అది బాగా ఆలోచించి చిలుక, కోతి మాత్రమే ఆ పనిని చేయగలవని నమ్మింది. వాటిని పిలిచి, ఆ పనిని అప్పజెప్పింది.
అంతే చిలుక, కోతి తమ పనిని ప్రారంభించాయి. బంగారం అడవిని ఆనుకుని ఉన్న మంచినీటి సరస్సులోకి చేరిందని ప్రచారం చేశాయి. కొంత కాలంలోనే ఆ విషయం సమీప ప్రాంతం అంతా పాకింది. అందులో నిజమెంత ఉందో? అని ఆలోచించకుండా ప్రజలు అడవిలోని చెట్లను నరకడం మానేసి, సరస్సులో బంగారం వెతకడం మొదలెట్టారు. దాంతో అడవి జంతువుల సమస్య తీరింది. అవి హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి.
ఈసారి సమస్య సరస్సులోనున్న జలచర జీవులకు వచ్చింది. మనుషులంతా సరస్సులోకి దిగి బంగారం కోసం వెతకసాగారు. దానివల్ల జల ఆవాసం పాడై, జీవులన్నీ చాలా ఇబ్బంది పడసాగాయి. దాంతో సరస్సులోని జలచర జీవులు అన్నీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సమావేశంలో పాల్గొన్న అనేక జీవులు 'అడవిలో ఉన్న జంతువుల వల్లే మనకీ దుస్థితి వచ్చింది. వారు తమను తాము రక్షించుకోవడం కోసం ఈ సమస్యను మన ఆవాసం మీదకి నెట్టారు. ఎలాగైనా ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఈ సమస్య నుంచి బయటపడాలి. మనలో తెలివైన చేపలకు ఈ పనిని అప్పజెప్పాలని నిర్ణయించుకున్నాయి' జలచర జీవులు. సరస్సులో బంగారం వెతకడం కోసం వచ్చే మనుషులకు వినిపించే విధంగా ఒకరోజు చేపలు 'మన సరస్సులోని బంగారమంతా సముద్రము లోకి వెళ్ళిపోయిందని ఇప్పుడే తెలిసింది!' అని అనుకున్నాయి. ఆ మాటలు విన్న మనుషులు అది నిజమో, కాదో కూడా తెలుసుకోకుండా సరస్సును వదిలి, బంగారం కోసం సముద్రం వైపు బయలుదేరారు. ఆ విధంగా సరస్సులో ఉన్న జలచర జీవులు తమ సమస్య పరిష్కారం అయినందుకు ఊపిరి పీల్చుకున్నాయి.
ఈసారి సమస్య సముద్రజీవుల వంతయ్యింది. ఈసారి మనుషులు బంగారం కోసం సరస్సును వదిలి, సముద్రంలో వెదకసాగారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చెట్టుపై నుంచి గమనిస్తున్న కాకి తన పిల్లలతో 'చూడండి పిల్లలూ! అసలు బంగారం ఉందో, లేదో తెలుసుకోకుండా మనుషులు అత్యాశకు పోయి, వారి సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అది చాలా తప్పు. ప్రతి ఒక్కరూ కష్టపడటానికి అలవాటుపడాలి. కష్టపడి, ఇష్టంతో చేసే ఏ పనైనా తృప్తినిస్తుంది, మంచి ఫలితానిస్తుంది. మీరు పెద్దయ్యాక, ఈ మనుషుల్లా కాకుండా కష్టపడి పనిచేసి, నిజాయితీగా మంచి మార్గంలో నడవండి!' అంటూ తన పిల్లలకు హితబోధ చేసింది తల్లి కాకి.
ఏడుకొండలు కళ్ళేపల్లి
94908 32338