ప్రజాశక్తి-రాయచోటి : రాయచోటి డివిజన్‌లో వారంలోగా ప్రభుత్వ అసైన్‌మెంట్ భూములు గుర్తింపు పూర్తిచేయాలని కలెక్టర్ గిరీష తహశీల్దార్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో రాయచోటి డివిజన్‌కు సంబంధించి అసైన్‌మెంట్ భూములు, రీ-సర్వే, ఎస్సీ, ఎస్టీ కాలనీలలో శ్మశాన వాటికలకు స్థలాల గుర్తింపు, క్లరికల్ కరెక్షన్స్ ఆఫ్ మాడ్యుల్స్ డిజిటల్ సిగేచర్ స్టేటస్ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయాతో కలిసి ఆర్‌డిఒ, తహశీల్దార్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. డివిజన్‌లోని రామాపురం, గాలివీడు మండలాలలో భూముల గుర్తింపు ప్రగతి బాగుందన్నారు. సంబేపల్లి, ఎల్‌ఆర్‌పల్లి మండలాలు భూముల గుర్తింపు, ఫైల్స్ రూపొందించే ప్రక్రియ ప్రగతిలో వెనకబడి ఉన్నారని, త్వరితగతిన గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి, ఫైల్స్ సచివాలయానికి సమర్పించాలని ఆయా తహశీల్దార్లను ఆదేశించారు. ఇప్పటి వరకు ఎంత భూమిని గుర్తించారు, ఇంకెంత గుర్తించాల్సి ఉంది, మొత్తం ఎన్ని ఫైల్స్ సిద్ధం చేయాలి, ఎన్ని చేశారు, ఇంకను చేయాల్సినవి ఎన్ని తదితర అంశాలలో కలెక్టర్ సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. ఆయా మండలాలలో భూముల గుర్తింపును స్వయంగా పర్యవేక్షణ చేయాలని ఆర్‌డిఒకు సూచించారు. ప్రభుత్వ భూమి ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని తహశీల్దార్లకు ఉద్భోదించారు. వాగులు, వంకలు, పోరంబోకు స్థలాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి మండలంలో గ్రామాల వారీగా.. సర్వేనెంబర్ల వారీగా ప్రభుత్వ భూమిని గుర్తించి నివేదిక పంపాలన్నారు. ఈ విషయంలో అలసత్వం చూపితే సహించేది లేదన్నారు. రీసర్వే అంశంలో భాగంగా గ్రామాలలో మాడ్యుల్స్ అన్ని పక్కాగా పూర్తి చేయాలని చెప్పారు. గ్రామాల్లో ఒక మాడ్యూల్, రెండు మాడ్యూల్స్ పెండింగ్‌లో ఉన్న వాటి సర్వేను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత తహశీల్దార్లను, రీసర్వే అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రీసర్వే పూర్తయిన గ్రామాలలో ఎదుర్కొన్న సమస్యలు ఇబ్బందులపై దృష్టి పెట్టి మరింత మెరుగ్గా రీ సర్వే పనిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. రీ సర్వేలో సాధారణంగా జాయింట్ ఖాతా, డిస్ప్యూట్స్, ఆక్రమణలు, పొజిషన్ మార్పులలో ఇబ్బందులు, సమస్యలు తలెత్తుతాయని వాటిని ప్రత్యేక ద ష్టితో పరిశీలించి రైతులతో సంప్రదించి పరిష్కరించాలని సూచించారు. రీ సర్వే గ్రామాలలో ప్రజలకు సమాచారం తెలియడానికి ముందస్తుగా టామ్ టామ్ చేయాలని, రీ సర్వే బృందం ఒకటి, రెండు రోజులు ఆ గ్రామంలోనే ఉండాలన్నారు. తహశీల్దార్లు, ఆర్‌డిఒలు వారానికి ఒకరోజు రీసర్వే జరుగుతున్న గ్రామాన్ని తప్పకుండా సందర్శించాలన్నారు. రీ సర్వే గ్రామాలలో సమస్యలు పరిష్కరించుకొని త్వరితగతిన భూహక్కుపత్రాలు పంపిణీ చేయాలని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న రీ సర్వే గ్రామాలలో రైతులందరికీ నోటీసులు జారీ చేసి సర్వే పూర్తయిన తర్వాత తప్పకుండా రైతులతో సంతకాలు తీసుకోవాలన్నారు. జిల్లాలో స్మశాన వాటికలు లేని ఎస్సీ ఎస్టీ కాలనీలకు వెంటనే స్మశాన వాటికల ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాలన్నారు. జిల్లాలోని 288 గ్రామాలలో 181.59 ఎకరాలను గుర్తించడం లక్ష్యమన్నారు. కనీసం 50 సెంట్ల నుంచి ఒక ఎకరా లోపు స్థలాలను గుర్తించి ఆమోదం కొరకు జిల్లా సచివాలయానికి పంపాలని సూచించారు. ఈ ప్రక్రియను కొన్నిచోట్ల పూర్తి చేశారని, మిగిలిన మండలాలలో కూడా త్వరితగతిన స్థలాల గుర్తింపు పూర్తి చేసి ఆమోదం కొరకు పంపించాలన్నారు. ఆమోదించబడిన శ్మశాన వాటికల సర్వే నెంబర్లను ఆన్‌లైన్ చేసి మండలాల వారీగా అడంగల్ కాపీని జిల్లా కేంద్రానికి పంపించాలని చెప్పారు. అనంతరం క్లరికల్ కరెక్షన్స్ ఆఫ్ మాడ్యుల్స్-డిజిటల్ సిగేచర్ ప్రగతిపై సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు. సమావేశంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి ఆర్‌డిఒ రంగస్వామి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి జయరాజ్, ఆయా మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.










