న్యూఢిల్లీ : పంజాబ్‌లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ విజయం దిశగా దూసుకెళుతోంది. దీంతో ఆప్ శ్రేణులన్నీ ఆనంద ఢోలికల్లో తేలియాడుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ చీఫ్ రాఘవ్ చద్దా స్పందిస్తూ.. ఆప్ ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించిందని అన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేస్తుందని, దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా మారనుందని పేర్కొన్నారు. ' ఆప్ జాతీయ శక్తిగా మారడాన్ని చూస్తున్నా.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఆప్ అవతరించబోతోంది' అని వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటికే ఆప్ ఢిల్లీలో అధికారంలో ఉండగా... ఇప్పుడు పంజాబ్‌ను కొల్లగొట్టింది. పార్టీగా ఆప్‌కు ఇదొక అద్భుతమైన రోజని, జాతీయ పార్టీగా అవతరించనుందని, ఇక ప్రాంతీయ పార్టీగా ఉండబోదని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఏదో ఒక రోజు దేశానికి నాయకత్వం వహిస్తారు అని పేర్కొన్నారు. 2012లో ఏర్పాటైన ఆప్ కన్నా రెండు రాష్ట్రాలను గెలుచుకునేందుకు బిజెపికి చాలా ఎక్కువ సమయం పట్టిందని పేర్కొన్నారు. కేజ్రీవాల్ పాలనా విధానాన్ని పంజాబ్ ప్రజలు చూసి.. ఈ అవకాశం కల్పించారని, ఐదు దశాబ్దాలుగా పంజాబ్ ప్రజలకు అందాల్సిన సౌకర్యాలు లేకుండా చేసిన వారు, శాశ్వతంగా పాలన చేస్తామని భావించిన వారికి గుణపాఠం చెప్పాలని ప్రజలు భావించారని రాజీవ్ చద్ధా ఎద్దేవా చేశారు.










