Apr 10,2022 23:00
  • అత్యంత క్రమశిక్షణ, అంకితభావం ప్రదర్శించిన మలయాళీలు
  • ఉత్తేజాన్నిచ్చిన ఎర్రదండు కవాతు

కన్నూరు (కేరళ) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : 'ఎవడురా కూసింది కమ్యూనిజం ఇక లేదనీ, ఎవడురా అన్నది కమ్యూనిజం ఇక రాదనీ...' అన్నారో కవి. ఆ మాటలకు సజీవ సాక్ష్యం ఆదివారం కేరళలోని కన్నూరులో వెల్లి విరిసిన అరుణారుణ చైతన్యం.. ఎర్రదండు ప్రవాహం. ఆ అపురూప ప్రదర్శనను వీక్షించిన వారు ఎర్రజెండా బలంపైనా, జనంలో దాని ప్రభావంపైనా గొప్ప ఉత్తేజంతో ఉప్పొంగిపోయారు. అంతలా భవిష్యత్‌ ఉద్యమాలకు భరోసానిస్తూ... గతంతోతోపాటు ఇప్పటి కేరళ కమ్యూనిస్టు వైభవాన్ని చాటిచెబుతూ... 'జయహో సీపీఎం' అని మనందరి చేతా అనిపించేలా వామపక్ష ఉద్యమ చరిత్రను కన్నూరు సువర్ణాక్షరాలతో లిఖించింది. సిపిఎం 23వ మహాసభ ఆఖరి రోజైన ఆదివారం ఇక్కడ నిర్వహించిన ఎర్రదండు కవాతు కమ్యూనిస్టు అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. అక్కడి ప్రజల మనసులను దోచుకొంది. ఇకె నయనార్‌ అకాడమీ నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏకేజీ నగర్‌ (జవహర్‌ స్టేడియం) వరకూ మూడు గంటలపాటు కొనసాగిన రెడ్‌ షర్ట్‌ వాలంటీర్ల కవాతును లక్షలాది మంది ప్రజలూ వీక్షిరచారు. దారి పొడవునా కమ్యూనిస్టు అభిమానులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు కవాతుకు జన నీరాజనాలు పలికారు. మూడేళ్ల బుడతడి నుంచి పండు ముదుసలి వరకూ అత్యంత క్రమశిక్షణతో, పార్టీ పట్ల తమ అంకితభావాన్ని ప్రదర్శిస్తూ ర్యాలీ కొనసాగినంత సేపూ నినాదాలతో కన్నూరును హోరెత్తించారు. వారి జోరు, హుషారు చూసి అగ్రనేతలు సీతారాం ఏచూరి, పినరయి విజయన్‌, ప్రకాశ్‌ కరత్‌, సుభాషిణీ అలీ, బృందా కరత్‌ తదితరులు తన్మయత్వం చెందారు. మార్క్సిజం, కమ్యూనిజం పట్ల అంచంచల విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ చిరునవ్వులతో తమకు సాదర స్వాగతం పలికిన కేరళ ప్రజానీకానికి ఆద్యంతం చేతులూపుతూ 'రెడ్‌ సెల్యూట్‌...' చేశారు. వారేకాదు... కమ్యూనిజం పట్ల మలయాళీలకున్న ఆదరాభిమానాలను చూసిన వారెవరైనా 'శిరస్సు వంచి నమస్కరించాల్సిందే...'. ఆ మాదిరిగా ఆ కవాతు... ఔరా... అనిపించింది.

cpm congress, kerala, rally, kannur, 23rd congress, ldf,