Mar 22,2022 06:48

   తెలుగు గడ్డపై మల్లు స్వరాజ్యం పేరు చెబితే తడుముకోకుండా స్మరణకొచ్చేది నాటి సాయుధ రైతాంగ తెలంగాణ పోరాటం. భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరీ విముక్తి కోసం మహోజ్వలంగా సాగిన తెలంగాణ పోరాటానికి మొన్నటి వరకు స్వరాజ్యం సజీవ సాక్ష్యం. పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించిన నేతల్లో భౌతికంగా మిగిలి ఉన్నవారు బహుశ ఆమెనే. పోరాట యోధురాలు స్వరాజ్యం శనివారం అమరులయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కర్విరాల కొత్తగూడెం అనే ఒక కుగ్రామంలో ఐదారొందల ఎకరాలు కలిగిన భూస్వామ్య కుటుంబంలో 1931లో స్వరాజ్యం జన్మించారు. అన్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి అడుగు జాడల్లో ఆంధ్ర మహాసభలో చేరి నైజాం ప్రజా కంటక పాలనకు వ్యతిరేకంగా బందూకు చేతబట్టి సాయుధ పోరాటంలోకి ఉరికారు. నైజాం ఏలుబడిలో రైతులపై, పేదలపై సాగుతున్న దొరల దౌర్జన్యాలు, దాష్టీకాలకు వ్యతిరేకంగా గ్రామ గ్రామాన సభలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం రగిలించి పోరాటంలోకి కదిలించారు. రజాకార్ల ఆగడాలను ప్రజలతో కలిసి ఎదురొడ్డి అడ్డుకున్నారు. నైజాం సర్కారు ఆమె తలకు పది వేల రూపాయలు వెల కట్టినా వెనక్కి తగ్గలేదు. స్వరాజ్యం సాయుధ పోరాటం పట్ల మహిళల్లో కలిగించిన జాగరూకత అనుపమానం. బతుకమ్మ పాటలతో ఉర్రూతలూగించి ఎందరికో పోరాటం ఎడల ప్రేరణ కలిగించారు. అందుకే మల్లు స్వరాజ్యం అంటే ఎగిసిన చైతన్య పతాక, సమరశీల నినాదం, దోపిడీదార్లకు సింహస్వప్నం. పోరాటాలకు చిరునామా.
    సాయుధ పోరాట విరమణ అనంతరం స్వరాజ్యం ఉద్యమ సహచరుడు మల్లు వెంకట నరసింహారెడ్డి (విఎన్‌)ని వివాహం చేసుకున్నాక వారి కుటుంబం కమ్యూనిస్టు ఉద్యమంలో మమేకమైంది. స్వరాజ్యం రెండు తడవలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తుంగతుర్తి నియోజకవర్గ ఎంఎల్‌ఎగా గెలిచి సేవలందించారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులుగా పని చేశారు. చనిపోయే వరకు పార్టీ కేంద్ర కమిటీకి ఆహ్వానితులు. ఐద్వా జాతీయ నాయకురాలిగానూ సేవలందించారు. మహిళల హక్కులు, వారి సమస్యలపై పోరాటాల్లో ముందుపీఠీన నిలబడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉవ్వెత్తున లేచిన సారా వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా పని చేశారు. పత్రికారంగంలోనూ కృషి చేశారు. వామపక్ష భావజాలంతో మహిళల సమస్యలపై మొదలైన 'చైతన్య మానవి' పత్రిక సంపాదకవర్గంలో ఒకరిగా ఉన్నారు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో పుట్టినందున స్వాతంత్య్ర కాంక్షతో స్వరాజ్యం అనే పేరు పెట్టి ఉండవచ్చు. మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం స్వరాజ్యం కల. పలు సందర్భాల్లో సమాజంలో మహిళలెదుర్కొంటున్న ఈతిబాధలపై స్పందించేవారు. స్వరాజ్యం మంచి వక్త. అసాధారణ వాగ్ధాటి ఆమెది. పాలకుల దోపిడీ, అన్యాయాలపై ఆమె ప్రసంగాలు చీల్చి చెండాడేవి. ప్రజలు ఉత్తేజితులయ్యేవారు.
    తెలంగాణ సాయుధ పోరాట సమయంలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులకు నైజాం వంటి వారు ఊడిగం చేసేవారు. ప్రస్తుత పాలకులు సామ్రాజ్యవాదం, అది పెట్టి పోషించే పెట్టుబడిదారులకు మితిమీరిన లాభాలు చేకూర్చే నయా-ఉదారవాద విధానాలను అమలు చేయడం ద్వారా ఊడిగం చేస్తున్నారు. సాయుధ పోరాటం ఎలుగెత్తిన నినాదం దున్నేవాడికే భూమి. ఆ లక్ష్యం నేటికీ నెరవేరలేదు. పాలకుల విధానాలతో వ్యవసాయం సంక్షోభంలో పడింది. దేశీయ వ్యవసాయాన్ని బహుళజాతి దోపిడీ నుండి కాపాడుకుంటూనే 'దున్నే వానికి భూమి' నినాదాన్ని సాకారం చేయవలసిన కర్తవ్యం నేటికీ ముఖ్య కర్తవ్యంగానే పీడిత ప్రజల ముందు ఉంది. దోపిడీకి గురవుతున్న రైతులకు, గ్రామీణ పేదలకు, బడుగు బలహీనవర్గాలకు స్వరాజ్యం చూపిన బాట అవసరం ఎంతైనా ఉంది. ఆమె అందించిన పోరాట స్ఫూర్తి ఎప్పటికీ సజీవంగా నిలుస్తుంది. స్వరాజ్యం మరణం సమాజ మార్పు కోసం సాగే విప్లవోద్యమాలకు వెలితి. తన పదకొండేళ్ల చిరు ప్రాయంలో ప్రజా జీవితంలో అడుగుపెట్టిన స్వరాజ్యం ప్రజలే చరిత్ర నిర్మాతలని తన 75 సంవత్సరాల విప్లవ రాజకీయ ప్రస్థానం నుండి పాఠాలు తీశారు. కడ దాకా సోషలిజమే సర్వ మానవాళి విముక్తి మార్గమని విశ్వసించి అందుకోసం పరితపించారు. ఆమె అందించిన స్ఫూర్తితో విప్లవ సాధనకు కృషి చేయడమే కామ్రెడ్‌ స్వరాజ్యంకు అర్పించే అసలు సిసలు అరుణాంజలి.