కన్నూర్ (ఈకే నాయనార్ నగర్) : ధగద్ధగల అరుణకాంతుల మధ్య.. ఎర్రజెండా జయజయ నినాదాల మధ్య కేరళలోని చారిత్రిక పోరాటాల గడ్డ కన్నూర్‌లో సిపిఎం 23వ అఖిల భారత మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సభలు ఈనెల 10వ తేదీ వరకూ జరుగుతాయి. బుధవారం ఉదయం ఉత్తేజపూరిత వాతావరణం మధ్య సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎస్.రామచంద్రన్ పిళ్లై అరుణపతాకను ఆవిష్కరించారు. కళాకారుల విప్లవ గీతాల ఆలాపనతో, సిపిఎం జిందాబాద్ నినాదాలతో మహాసభల ప్రాంగణం హోరెత్తింది. ప్రతినిధులు అరుపతాకకు రెడ్ సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా రామచంద్రన్ పిళ్లై మాట్లాడుతూ, దేశ లౌకికవాదానికి ముప్పుగా పరిణమించిన బీజేపీని ఏకాకిని చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాసభలో రాజకీయ తీర్మానం ప్రవేశపెడతారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి ప్రతినిధుల చర్చలు మొదలవుతాయి. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు, పరిశీలకులు, కేంద్ర కమిటీ సభ్యులు సహా 812 మంది పాల్గొంటారు.











