Mar 28,2022 09:03

విస్తీర్ణంలో ఉత్తరప్రదేశ్‌ అంత భూమి
రాష్ట్రంలో కనపడని 31 లక్షల ఎకరాలు

దేశ వ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెరిగినట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, వాస్తవం వేరు. నిజానికి పెద్ద మొత్తంలో అటవీభూమి దేశంలో కనపడకుండా పోయింది. ఇలా మాయమైన భూమి 25.87 మిలియన్‌ హెక్టార్లు (6 కోట్ల 39 లక్షల ఎకరాలు) ఉంటుందని అంచనా! అంటే, దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ విస్తీర్ణం కన్నా ఎక్కువ! కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను అధ్యయనం చేసిన 'డౌన్‌ టు ఎర్త్‌' ఈ నిర్ధారణ చేసింది.ఇలా కనపడకుండా పోయిన వాటిలో తెలుగు రాష్ట్రాల అడవులు కూడా ఉన్నాయి. . కార్పొరేట్లకు అటవీభూములను కేటాయించడానిక వీలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల చట్ట సవరణ చేసిన నేపథ్యంలో ఇప్పటికే కొనసాగుత్న అడవుల విధ్వంసం ఇది. దేశ వ్యాప్తంగా ఇటీవల చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులకు ఇంత భారీ మొత్తంలో అటవీభూమి విధ్వంసం జరగడం కూడా ఒక కారణమని భావిస్తున్నారు.
 

ప్రజాశక్తి  - అమరావతి  కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా 25.87 మిలియన్‌ హెక్టార్ల (6కోట్ల 39 లక్షల ఎకరాలు) నమోదైన అడవులు (రికార్డెడ్‌ ఫారెస్ట్‌ ఏరియాాఆర్‌ఎఫ్‌ఎ) మాయమైనాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ విస్తీర్ణంతో ఇది దాదాపుగా సమానం. ఇంత పెద్ద మొత్తంలో అడవులు ధ్వంసమైన విషయాన్ని సైతం కేంద్ర ప్రభుత్వం తనదైన ధోరణిలో తిమ్మిని బమ్మి చేసింది. గతంతో పోలిస్తే అడవులు పెరిగాయని దేశ ప్రజలను నమ్మించింది. దీనికోసం రికార్డు అయిన అటవీభూమిలో కాకుండా దానికి బయట పెరిగే చెట్లను, పెంచే వనాలను కూడా పరిగణలోకి తీసుకుంది గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా నమోదైన అడవులు 77.53 మిలియన్‌ హెక్టార్లలో వ్యాపించి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండే ఈ అటవీభూముల్లో రిజర్వు ఫారెస్టులు, అభయారణ్యాలు, ఎటువంటి వర్గీకరణ చేయని అడవులు ఉన్నాయి. అయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్టు (ఐఎస్‌ఎఫ్‌ఆర్‌) -2021 ప్రకారం మొత్తం నమోదైన అటవీభూమిలో ప్రస్తుతం 51.66 మిలియన్‌ హెక్టార్లలో మాత్రమే అడవులు ఉన్నాయి. మరి, మిగిలిన 25.87 మిలియన్‌ హెక్టార్ల అటవీ భూమి ఏమైనట్టు? నివేదిక మొత్తం మీద ఒకే ఒక్క చోట 'అడవులు లేని... అటవీ ప్రాంతం ' అని పేర్కొన్నారు. అడవులను ఎంత నరికేసినా కనీసం చిట్టడవులుగా మిగలాలి కదా అని గణాంకాల్లో వెదికితే దేశం మొత్తం మీద 4 మిలియన్‌ హెక్టార్ల భూమిని మాత్రమే నివేదికలో చిట్టడవులుగా పేర్కొన్నారు. ఇవి కూడా నమోదైన అటవీభూమి లో ఉన్నాయా, బయట ఉన్నాయా అన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొనలేదు. మరి కనపడకుండా పోయిన 25.87 మిలియన్‌ హెక్టార్ల అడవుల పరిస్థితి ఏమిటి? అడవులు లేని అటవీ ప్రాంతంగా యైనా ఆ భూమి ఉందా? ఇప్పటికేఆక్రమణలకు గురైందా అన్న ప్రశ్నలకు నివేదికలో సమాధానం కనపడదు. ఇంత పెద్ద మొత్తంలో జరిగిన అడవుల నిర్మూలన వాతావరణంపై చూపే ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
 

ఏ రాష్ట్రంలో ఎంత...?
మధ్య ప్రదేశ్‌లో అత్యధికంగా 30 లక్షల హెక్టార్లలోని అడవులు కనిపించకుండా పోయాయి. ఇది ఆ రాష్ట్రంలోని మొత్తం నమోదైన అటవీ భూమిలో 32 శాతం. జార్ఖాండ్‌లో ఇది 50శాతంగా ఉంది. గుజరాత్‌లో 12 లక్షల హెక్టార్లలోని అడవులు తాజా నివేదికలో కనిపించడం లేదు. ఇది ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం అటవీభూమిలో 55 శాతం. పుదుచ్చేరిలో అత్యధికంగా 92 శాతం నమోదైన అడవులు ప్రస్తుతం మాయమైనాయి.

తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?
తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిణామం కొనసాగుతోంది. ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ా2021 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 13,01,900 హెక్టార్ల(సుమారుగా 31 లక్షల ఎకరాలు) లోనిఅడవులు మాయమైనాయి. ఇది మొత్తం రికార్డెడ్‌ అటవీభూమిలో షుమారుగా 35 శాతం. తెలంగాణలో 33 శాతం రికార్డెడ్‌ భూమిలోని అడవులు తగ్గాయి. పొరుగున ఉన్న తమిళనాడులో దాదాపు 25 శాతం, కర్నాటకలో 41శాతం రికార్డైన అటవీభూమిలో ప్రస్తుతం అడవులు కనిపించడం లేదు.
 

ఆ రాష్ట్రాల్లో భిన్నం
గిరిజన ప్రజానీకం అధికంగా ఉండే నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, మిజోరం, లడఖ్‌లలో దీనికి భిన్నమైన స్థితి నెలకొంది. ఈ రాష్ట్రాలో మాత్రం రికార్డైన అటవీ భూముల్లో సైతం అడవులు గతంతో పోలిస్తే పెరిగాయి. ఆరు శాతం నుండి 130 శాతం వరకు పెరుగుదల నమోదైంది.
పెరిగిందేమిటి..?
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం 2019లో 71.22 మిలియన్‌ హెక్టార్లుగా ఉన్న అటవీ ప్రాతం (ఫారెస్ట్‌ కవర్‌ ఏరియా) 2021 నాటికి 71.38 మిలియన్‌ హెక్టార్లకు పెరిగింది. అంటే 0.16 మిలియన్‌ హెక్టార్ల (0.2శాతం) నామమాత్రపు పెరుగుదల నమోదైంది. అయితే, ఇది రికార్డెడ్‌ అటవీ ప్రాంతం (ఆర్‌ఎఫ్‌ఎ) లో నమోదైన పెరుగుదల కాదు. దానికి బయట కూడా ఇటీవల కాలంలో వివిధ పేర్లతో చెట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. వీటిని కూడా పరిగణలోకి తీసుకోని మొత్తం అటవీ ప్రాంతం పెరిగినట్టుగా చూపించారు. వాస్తవానికి సాంప్రదాయ అడవులు మాయమవుతున్నాయి!