ప్రజాశక్తి-హెల్త్‌యూనివర్సిటీ : ఆర్థోపెడిక్ వైద్య రంగంలో అనేక అద్భుత ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయని వక్తలు పేర్కొన్నారు. అరిగిన మోకాలి సమస్యకు ఆపరేషన్ అవసరం లేకుండా అత్యాధునిక సెల్యులార్ ఫ్రాక్షన్ చికిత్స అందుబాటులోకి వచ్చినట్లు వారు వెల్లడించారు. విజయవాడ ఆర్థోపెడిక్ సొసైటీ, అను హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో అడిపోస్ సెల్యలార్ ఫ్రాక్షన్ అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. నగరంలోని కే హోటల్లో ఆదివారం జరిగిన ఈ ఎస్వీఎఫ్ వర్క్ షాప్ కు విశేష స్పందన లభించింది. విజయవాడ ఆర్థోపెడిక్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఎం.జె.నాయుడు, కార్యదర్శి డాక్టర్ కర్లపూడి వాసు, అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ జి.రమేష్ తదితర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యశాలను ప్రారంభించారు. అనంతరం వేర్వేరు అంశాలపై నిపుణులు చేసిన ప్రసంగాలు విజ్ఞానదాయకంగా సాగాయి. అడ్వాన్స్డ్ సెల్యులార్ ఫ్రాక్షన్ అంశంపై డాక్టర్ వేన్ థామస్, రీజనరేటివ్ మెడిసిన్ చికిత్సల విశ్లేషణపై డాక్టర్ మిట్టల్ పారిఖ్, డాక్టర్ రాజ్ శర్మ, ఆస్టియోఆర్థరైటిస్ లో ఆడిపోస్ సెల్యులార్ ఫ్రాక్షన్ ఎవిడెన్స్ గురించి డాక్టర్ రాజ్ శర్మ ప్రసంగించారు. వయోవద్ధులకు మోకాలి నొప్పి చికిత్సల్లో సవాళ్లు, సెల్యులార్ ఫ్రాక్షన్ కోసం రోగుల ఎంపిక తదితర అంశాలపై డాక్టర్ వినరు తాంతువే ప్రసంగించారు. ఆధునిక శస్త్రచికిత్స విధానాల గురించి వీడియోల సహాయంతో ఆయన వివరించారు. అనంతరం సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. వర్క్ షాప్ లో అను హాస్పిటల్స్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.దుర్గానాగరాజు మాట్లాడుతూ ఆస్టియోఆర్థరైటిస్ సమస్యకు కొవ్వులోని మూల కణాలతో అత్యాధునిక చికిత్స అందుబాటులోకి వచ్చిందన్నారు. రోగి యొక్క ఉదర భాగంలోని కొవ్వు నుంచి మూలకణాలను ఒక ప్రత్యేక పద్ధతిలో సేకరించి, అరిగిన మోకాలికి చికిత్స నిర్వహిస్తామని అన్నారు. గతంలో అరిగిన మోకాలికి పీఆర్పీ తదితర ఇంజెక్షన్లు ఇచ్చేవారమని, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అడ్వాన్స్డ్ సెల్యులార్ ఫ్రాక్షన్ ద్వారా తొలి మూడు దశల్లోని రోగులకు ప్రభావవంతమైన చికిత్స అందించవచ్చని తెలిపారు. కోతలు, గాట్లు లేని ఈ చికిత్స ద్వారా అరిగిన మోకాలి సమస్యను ఆపరేషన్ లేకుండానే సరిచేయవచ్చని డాక్టర్ దుర్గానాగరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అను హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ జి.రమేష్ మాట్లాడుతూ అత్యాధునిక ఆర్థోబయోలజిక్ చికిత్సలను అధ్యయనం చేసి, అవలంభించేందుకు ఈ వర్క్ షాప్ చక్కగా దోహదపడుతుందని అన్నారు. అత్యాధునిక సెల్యులార్ ఫ్రాక్షన్ చికిత్సను రాష్ట్రంలో తొలిసారిగా తమ హాస్పిటల్ నందు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఈ అత్యాధునిక చికిత్స ద్వారా అరిగిన మోకాలి సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. అరిగిన మోకాలి సమస్యతో బాధపడుతున్నవారు అను హాస్పిటల్స్ నందు అందుబాటులో ఉన్న ఈ అత్యాధునిక సెల్యులార్ ఫ్రాక్షన్ చికిత్సను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రమేష్ సూచించారు. ఈ కార్యశాలలో అను హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ పేరూరి శ్రీనివాసన్, డాక్టర్ కె.వి.వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










