Apr 22,2022 07:28
  • లెక్కల్లో కూడికలు, తీసివేతలపై కసరత్తు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రం కొర్రీలపై నివేదికలు సిద్ధం చేయడంలో ఆర్థికశాఖ తలమునకలవుతోంది. చేసిన అప్పులు, చెల్లిస్తున్న వడ్డీలు, వాయిదాలు వంటి ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడం ఆషామాషీ వ్యవహారం కాదని తేలుతున్నట్లు అధికారులే అంగీకరిస్తున్నారు. కాగా చేసిన అప్పులపై కేవలం ఇద్దరు ఆర్ధికశాఖ అధికారులకు మాత్రమే అవగాహన ఉండడంతో వారిద్దరు మాత్రమే సమాధానాలు సిద్ధం చేసే ప్రక్రియలో పాలుపంచుకుంటున్నట్లు తెలుస్తోంది. వారిద్దరే ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కెవివి సత్యనారాయణ.
     గత రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణాలపై పలు కోణాల్లో కేంద్రానికి, రిజర్వ్‌బ్యాంకుకు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా ఆరా తీయడం ప్రారంభించినట్లు తెలిసింది. ఇప్పటికే కొత్త రుణాలపై ఆంక్షలు విధిస్తున్న కేంద్రం, పాత అప్పులపైనా నివేదికలు కోరుతోంది. ఇప్పటికే తీసుకున్న బహిరంగ మార్కెట్‌ రుణాలు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన గ్యారంటీల ద్వారా తీసుకున్న అప్పులు, వాటికి చెల్లిస్తున్న అసలుపై వాయిదాలు, వడ్డీల వివరాలు చెప్పాలని గత ఏడాది కాలంగా కేంద్రం, ఎజి కార్యాలయాలు కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు రాష్ట్రం నుంచి సరైన వివరాలు మాత్రం రావడం లేదని కేంద్ర ఆర్థికశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వార్షిక రుణాలపై రాష్ట్రానికి రాసిన లేఖలో మరోసారి ఇవే వివరాలను కేంద్రం అడిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు రావత్‌, సత్యనారాయణ స్వయంగా కూర్చొని కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ లెక్కలను తయారుచేసేందుకు వారు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. భారీగా రుణాలు తీసుకున్నప్ప టికీ, వాటిని చూపడంలో సమస్యలు ఉంటాయని వారు భావిస్తున్నారు. ఇన్నాళ్లూ స్వల్పంగా మాత్రమే రుణాలు చూపించిన ఆర్థికశాఖ, ఇప్పుడు వాస్తవ రుణాలు చూపిస్తే ఇబ్బందులు తప్పవని ఇతర అధికారులు అంటున్నారు. అందుకే లెక్కలు తయారీలో ఎలా ముందుకు సాగాలన్నది అర్థంకాక ఆర్థికశాఖ ఇబ్బందులు పడుతున్నట్లు ఆ శాఖ దిగువస్థాయి అధికారులు అంటున్నారు.