ప్రజాశక్తి-రాయచోటి : బ్యాంకర్లు ప్రభుత్వ లక్ష్య సాధన దిశగా పనిచేసి జిల్లా ఆర్ధిక ప్రగతిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ గిరీష బ్యాంకు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పిఎంఇజిపిి, 6వ విడత జగనన్నతోడు లబ్ధిదారులకు రుణాలు మంజూరుపై కలెక్టర్ బ్యాంకర్లుతో డిసిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్నతోడు పథకంలో భాగంగా వీధుల్లో చిరు వ్యాపారులు, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి పెట్టుబడి కింద బ్యాంకుల ద్వారా రూ.10 వేలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నారు. జగనన్న తోడు పథకంలో వచ్చే దరఖాస్తులను బ్యాంకులు వీలైనంత త్వరగా పరిష్కరించి, మీకు ఇచ్చిన రుణ లక్ష్యాలు సాధించాలన్నారు. జగనన్నతోడు 6వ విడతకు సంబంధించి జిల్లాలో అర్బన్ ప్రాంతాలలో 3230 మంది, రూరల్ ప్రాంతాలలో 11,950 మంది లబ్ధిదారులకు జగనన్న తోడు రుణాలు మంజూరు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలోని వివిధ బ్యాంక్ మేనేజర్లు మీకు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. జగనన్నతోడు పథకంలో రుణం పొంది సకాలంలో చెల్లించిన వారికి అదనంగా వెయ్యి రూపాయల వరకు రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు. అవకాశం ఉంటే వీలైనంత ఎక్కువ మందికి రుణాలు ఇవ్వాలన్నారు. జగనన్నతోడు ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ద ష్టి సారించిందని ఈ పథకానికి సంబంధించి వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ రుణాలను మంజూరు చేయాలన్నారు. పిఎంఇజిపి పథకంలో భాగంగా జిల్లాలో జగనన్న హౌసింగ్ ఇల్ల నిర్మాణాలు మరింత వేగవంతంగా పూర్తి చేసేందుకు సెంట్రింగ్ చేసే వారికి మండలానికి ఒకరికి తప్పకుండా రూ.10 లక్షలు రుణం ఇవ్వాలని బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రతి మండలంలో సెంట్రింగ్‌లో నైపుణ్యం ఉన్న వారిని మండలానికి ముగ్గురు చొప్పున గుర్తించి వారి వివరాలను తమకు పంపాలని హౌసింగ్ పీడీకి సూచించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా జిల్లాకు సంబంధించిన అన్ని బ్యాంకులు కనీసం ఐదు రుణాలు తప్పనిసరిగా అర్హులకు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పేదలకు ఇళ్ళు పథకంలో భాగంగా గృహ నిర్మాణం కోసం అదనంగా రుణాలు అవసరమైన మహిళలకు రుణ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. లబ్ధిదారులందరికి హౌసింగ్ లోన్లు మంజూరు చేసి త్వరితగతిన ఇల్ల నిర్మాణాల పూర్తికి సహకరించాలన్నారు. రుణ ప్రణాళికలో నిర్ధేశించిన మేరకు ఆయా రంగాలకు త్వరితగతిన రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు సహకరించి అన్నమయ్య జిల్లాను అభివృద్ధికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్వర రెడ్డి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజ, డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు.










