ప్రజాశక్తి రొద్దం : పెనుకొండ ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు సర్వీసులను మండలంలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు గురువారం అడ్డుకున్నారు. బస్సులు సమయపాలన లేకుండా నడపడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్న కారణంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు బస్సు సర్వీసులను అడ్డుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రోజు సమయపాలన పాటించకుండా ఎప్పుడుపడితే అప్పుడు బస్సులను నడుపుతున్నామన్నారు. దీంతో తాము సమయానికి కళాశాలకు హాజరుకాలేక పోతున్నామని వాపోయారు. గురువారం మధ్యాహ్నం 3గంటలకు రావాల్సిన బస్సు సాయంత్రం 5 :30 గంటలకు వచ్చిందన్నారు. ఆతరువాత వచ్చిన బస్సు కూడా నిలపకుండా పోవడంతో విసుగు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. అంతేకాకుండా సమస్యను పెనుకొండ ఆర్టీసీ డిఎమ్‌కు ఫోన్‌ద్వారా సమాచారమిచ్చారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్ష జరుగుతున్నాయని కనీసం విద్యార్థులు ఇక్కడే ఇంత సమయం వృథా చేస్తే ఇక ఇంటికి ఎప్పుడు వెళ్లి చదువుకోవాలని కళాశాల అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో బస్సులో నడపాలని గతంలో వినతిపత్రం సమర్పిస్తే ఒకటిరెండు రోజులు సకాలంలో బస్సు సర్వీసులు నడిచాయన్నారు. అనంతరం సమయపాలన పాటించలేదని విమర్శించారు. ఇప్పటికైనా సకాలంలో బస్సు సర్వీసులు నడపాలని వారు కోరారు.










