మదనపల్లె అర్బన్ : పట్టణం సమీపంలోని చారిత్రాత్మక ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ నూతన డైరెక్టర్‌గా డాక్టర్ కె.పి.రవీంద్ర గురువారం రాయలసీమ డయాసిస్ బిషప్ డాక్టర్ ఐజాక్ వరప్రసాద్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బిషప్ వరప్రసాద్ మాట్లాడుతూ 110 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిందన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ఇక్కడ మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల కుటుంబ పాలన పర్యవేక్షణలో ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ ఒడిదొడుకులను ఎదుర్కొన్నదన్నారు. గత డైరెక్టర్ ఇష్టానురీతిలో వ్యవహరించడం వల్ల ఆరోగ్యం మెడికల్ సెంటరులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఇక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి నూతన పాలకవర్గాన్ని గత ఏడాది డిసెంబర్‌లో రాయలసీమ డయాసిస్ పెద్దలు ఏర్పాటు చేశారని చెప్పారు. రవీంద్ర నియామకం రాయలసీమ డయాసిస్ నిబంధనకు లోబడి, చట్టబద్ధంగా జరిగిందన్నారు. ఇందులో రాజకీయాలు కానీ, వేరే ఉద్దేశ్యం ఏమీ లేదని స్పష్టం చేశారు. గత డైరెక్టర్ కార్యాలయానికి తాళం వేసి వెళ్లడంతో రెవెన్యూ, పోలీస్ శాఖ సమక్షంలో తలుపులు బద్దలు కొట్టిన అనంతరం రవీంద్ర డైరెక్టర్ కుర్చీలో ఆశీనులయ్యారు. అనంతరం నూతన డైరెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ డైరెక్టర్‌గా ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. గతంలో జమ్మలమడుగులో క్యాంప్‌బెల్ ఆసుపత్రిలో 25 సంవత్సరాలపాటు కంటి వైద్యుడిగా సేవలందించి, లక్షలాది మందికి కంటి శస్త్రచికిత్సలు నిర్వహించానని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ అభివద్ధికి నిస్వార్థమైన సేవలు అందిస్తానని స్పష్టం చేశారు. తనకు ఈ అవకాశం కల్పించిన వరప్రసాద్, రాయలసీమ డయాసిస్ పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆరోగ్యవరం నర్సింగ్ కళాశాల అడిషనల్ ఇన్‌ఛార్జిగా డాక్టర్ డాక్టర్ శామ్యూల్ స్వరూప్ కుమార్ బాధ్యతలు చేపట్టగా, నూతన ట్రెజరర్‌గా త్వరలోనే డాక్టర్ ధనరాజ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కార్యక్రమంలో రాయలసీమ డయాసిస్ ఆఫీసర్లు సి.సాల్మన్, యు.సాల్మన్, పి.ఎన్.వినరు కుమార్, ట్రెజరర్ మేరీ కుమార్, ఆరోగ్యం మెడికల్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.
- ఆరోగ్యవరం డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న రవీంద్ర










