May 31,2023 20:50

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : జగనన్నకు చెబుదాం స్పందన అర్జీల ఎండార్స్‌మెంట్‌ నాణ్యతగా ఉండాలని కలెక్టర్‌ గిరీష తహశీల్దార్లను ఆదేశించారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్‌ నుంచి జగనన్నకు చెబుదాం అర్జీలను నాణ్యతగా పరిష్కరించడంపై ఆర్‌డిఒలు, తహశీల్దార్లతో వీడియోకాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆర్‌డిఒ, తహశీల్దార్‌ లాగిన్‌లలో ఉన్న రీఓపెన్‌ అర్జీలను వెంటనే పరిష్కరించాలన్నారు. సదరు అర్జీలను మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు ఏ సమస్య లేవనెత్తాడు, అందుకు సరైన విధంగా పరిష్కారం చూపాలి, ఒకవేళ చర్య తీసుకోలేకపోతే ఎందుకు తీసుకోలేకపోతున్నామన్న వివరాలను స్పష్టంగా అర్జీదారునికి తెలియజేయాలన్నారు. నాణ్యమైన నివేదికను, అందుకు సంబంధించిన ఫొటోలు స్పందన ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ మండలాలకు సంబంధించి రీఓపెన్‌ అయిన అర్జీలలో తహశీల్దార్లు ఏ విధంగా ఎండార్స్‌మెంట్‌ ఇచ్చారు, అర్జీదారుడు తిరిగి దానిని ఎందుకు రీఓపెన్‌ చేశారని ఏవిధంగా ఎండార్స్‌మెంట్‌ చేయాలనే విషయంపై కలెక్టర్‌ దిశా నిర్దేశం చేశారు. అర్జీలను నిర్ణీత కాలపరిమితిలోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎలోకి వెళ్లరాదని చెప్పారు. ఆర్‌డిఒలు తమ పరిధిలో రీఓపెన్‌ అవుతున్న అర్జీలను ఎప్పటికప్పుడూ పరిశీలించి నాణ్యమైన ఎండార్స్‌మెంట్‌ జారీచేసే విషయంలో తహశీల్దార్లకు తగు సూచనలు జారీ చేయాలని పేర్కొన్నారు. అంతకుముందు రాజంపేట డివిజన్‌కు సంబంధించి అసైన్మెంట్‌ భూముల ప్రగతిపై సంబంధిత డివిజన్‌ తహశీల్దార్లతో కలెక్టర్‌ సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు.