Sep 07,2022 22:34

ప్రజాశక్తి-విజయవాడ
ప్రజలకు దగ్గరగా ఉంటూ మెరుగైన సేవలు అందించడంతో పాటు సచివాలయానికి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు సచివాలయ ఉద్యోగులకు సూచించారు. విజయవాడలోని దుర్గాపురం 199, గులాబీ తోట 200వార్డు సచివాలయాలను బుధవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూమెంట్‌ రిజిస్టర్‌, సంక్షేమ పథకాల క్యాలెండర్‌ మనం గుర్తు పెట్టుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌ లైన్‌ నెంబర్లు, వైఎస్‌ఆర్‌ పింఛన్‌కానుక, జగనన్న అమ్మఒడి, రైతుభరోసా వివిధ పథకాల అర్హుల అనర్హుల జాబితాను ఎస్‌ఎల్‌ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక తదితర రికార్డులను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. నవరత్నాలు పేదలందరికి ఇళ్లు పథకంలో ఇంటి పట్టాలకు సంబంధించి ఇంకనూ ప్రారంభం కాని, బిలో బేస్మెంట్‌ స్థాయిలో ఉన్న ఇళ్లను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. వార్డు సచివాలయం పరిధిలో ఎంత మంది గర్భిణీలు ఉన్నారు. ఎంత మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. మాతృమరణాలు ఏమైనా జరిగాయా వంటి వివరాలను ఏఎస్‌ఎంను అడిగి తెలుసుకొని గర్భిణి స్త్రీలలో రక్తహీనతను దూరం చేయడానికి పోషకా హారమైన భోజనం తీసుకునేలా మరింత అవగాహన కల్పించాలన్నారు. జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకం పాఠశాలలో ఎలా అమలు అవుతుంది సమాయానికి భోజనం అందిస్తున్నారా వంటి వివరాలను వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ను జిల్లా కలెక్టర్‌ అడిగి తెలుసుకుని పాఠశాలలను తనిఖీలు చేస్తూ మధ్యాహ్నం భోజనం సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకో వాలన్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించాలని సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా సమయ వేళలు పాటించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ వెంట నార్త్‌ తహాశీల్థార్‌ దుర్గాప్రసాద్‌ ఉన్నారు.