ప్రజాశక్తి -పెనుకొండ : ఇళ్లు లేని నిరుపేదలకు స్థలాలు చూపించాలని వ్యవసాయ కార్మికసంఘం నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కమిషన్ చాంబర్‌లో బైటాయించి నిరసన తెలిపారు. అనంతరం కమిషనర్ వంశీకృష్ణభార్గవ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ పేదలు అర్జీలు ఇచ్చి నెలరోజులు అవుతున్నా అధికారుల్లో చలనం లేదన్నారు. అర్జీలు పరిష్కారం చేయాలని కోరితే 90 రోజుల స్కీమ్ కింద ఇంకా రెండు నెలలు సమయం ఉందని అధికారులు తెలపడం విడ్డురంగా ఉందన్నారు. పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలోని స్థలాలు, భూములను బడా నాయకులు ఆక్రమించుకుంటున్నా వాటిని నివారించే చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటన్నారు. 15 రోజుల లోపు స్థలాలు చూపక పోతే పేదలతో కలిసి గుడిసెలు వేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు వెంకట్రాముడు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తిప్పన్న, నాయకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.










