ప్రజాశక్తి - రాయచోటి టౌన్ : వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుకు ఆర్‌జెడి, డిఇఒలు ప్రచారం చేస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎస్.నరసింహ అన్నారు. మంగళవారం ఎస్ ఎఫ్ ఐ కార్యలయం లో ఆయన మాట్లాడుతూ మార్చి నెలలో జరగబోయే పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, గాడ్యువేట్ ఎన్నికల నేపథ్యంలో ఆర్‌జెడిి, డిఇఒలు వైసిపి అభ్యర్థుల గెలుపు కోసం తెర వెనుక కృషి చేయడం సిగ్గుచేటన్నారు. ఒకవైపు ఇదే అధికారులు నిబంధనలకు అతిక్రమించి పనిచేస్తే చర్యలు తీసుకుంటామని చెబుతూనే మీరే నిబంధనలను అతిక్రమించడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లాలలో ప్రయివేటు విద్యా సంస్థలలో ఉపాధ్యాయ ఓటర్లు దొంగ ఓట్లు విచ్చలవిడిగా నమోదయ్యాయని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు. ఒకవైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి విచ్చలవిడిగా ప్రలోభాల గురి చేసే విధంగా వ్యవహార శైలి ఉందన్నారు. అందరినీ ప్రలోభాల చేసే ప్రయత్నాలు ప్రభుత్వ అధికారుల చేతనే లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుందని పేర్కొన్నారు. అధికారులు మాత్రం పట్టించుకోలేదని దానికి పాఠశాలల్లో విచ్చలవిడిగా నమోదైన ఉపాధ్యాయ ఓట్లే నిదర్శనమన్నారు. నిబంధన అతిక్రమించి ఎన్నిక ప్రచారం చేస్తున్న ఆర్‌జెడి, డిఇఒలపైన ఎన్నికల అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి సాయి కుమార్, సిఐటియు నాయకులు షేక్ ఫాయాజ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నరేష్, నిరంజన్, శ్రీనాథ్, రాజు పాల్గొన్నారు.










