మదనపల్లె అర్బన్ : అర్హులైన అబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నవాజ్‌బాషా అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడటం కోసమే గడప గడపకూ మన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.గురువారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 30వ వార్డులో పర్యటించారు. ఎమ్మెల్యేకి మార్కెట్ కమిటీ డైరెక్టర్ తట్టి శ్రీనివాసులురెడ్డి, మార్కెట్ చైర్మన్ తట్టి శారదమ్మ ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం శ్రీనివాసులురెడ్డి ఇంటి వద్ద నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఒక్కరేనన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శారదమ్మ, డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అవినీతి రహిత పరిపాలన అందిస్తూ, సమస్యలను ఎక్కడికక్కడే, ఎప్పటి కప్పుడు పరిష్కరిస్తున్న నాయకుడు ఎమ్మెల్యే అని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు నూర్ ఆజాం, జింక వెంకట చలపతి, వార్డు కౌన్సిలర్ సరిత బాలగంగాధర్‌రెడ్డి, దండు కృష్ణారెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










