May 08,2023 19:01

సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే చింతల

ప్రజాశక్తి-వాల్మీకిపురం : అర్హులరదరికీ సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో వారి జీవన ప్రమాణం మెరుగవడంతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారన్నారు. సోమవారం వాల్మీకిపురం పంచాయతీ ప్యారంపల్లి, గొళ్లపల్లి గ్రామాల్లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల వివరాలు తెలియజేస్తూ సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సుఖ సంతోషాలే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం అద్భుతమైన నిర్ణయమన్నారు. ప్రతి సంక్షేమ పథకం పారదర్శకంగా లబ్ధిదారులకు అందుతోందన్నారు. అర్హతే ప్రామాణికంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలను సిఎం జగన్‌ అందిస్తున్నారన్నారు. ఆదర్శంగా, పారదర్శకంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందన్నారు. పేదలు, మహిళలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాలంటీర్ల ద్వారా అధికారుల దృష్టికి తీసుకొస్తే సమస్యను పరిశీలించి పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఫిరోజ్‌ ఖాన్‌, ఎంపిడిఒ షబ్బీర్‌ అహ్మద్‌, ఇఒ ఉదరు కుమార్‌, సర్పంచ్‌ గంగులమ్మ, నాయకులు నీళ్లభాస్కర్‌, కేశవరెడ్డి, అబ్దుల్‌ కలీమ్‌, రఘు, మహేష్‌, వెంకట్రమణ రెడ్డి, డివి రమణ, సైఫుల్లా, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.