ప్రజాశక్తి-హిందూపురం పురపాలక సంఘ వ్యాప్తంగా పార్టీలకతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత మీదేనని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇంద్రజ ఆయా వెల్ఫేర్ సెక్రటీలను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని ఛైర్‌పర్సన్ ఛాంబర్‌లో పురపాలక సంఘ వ్యాప్తంగా ఉన్న 43 సచివాలయాల వెల్ఫేర్ సెక్రటరీలతో పురపాలక సంఘంలో ఇటీవల వివిధ కారణలతో తాత్కాలికంగా రద్దు చేసిన పింఛన్లపై వైస్‌ఛైర్మన్ జబీవుల్లాతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సిఎం జగన్ పార్టీలకతీతంగా అర్హులందరికీ వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లతో పాటు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించారన్నారు. అయితే ప్రతివార్డులో పింఛన్లు రద్దు అవుతున్నట్లు నోటీసులు ఇచ్చారన్నారు. కావున వాటిని పరిశీలించి అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి రంగారావు, ఆర్‌ఐలు రాము, రామాంజి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఛైర్‌పర్సన్ ఇంద్రజ










