పుట్టపర్తి అర్బన్ : జిల్లా వ్యాప్తంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధిని చేకూరుస్తున్నట్లు ఎంపీ గోరంట్ల మాధవ్, కలెక్టర్ బసంత్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో నవరత్నాలు- ద్వైవార్షిక నగదు బదిలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ద్వైవార్షిక నగదు 11.84 కోట్లను 7422 మంది ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అవినీతికి తావు లేకుండా కులమతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. పొరపాటున ఏ కారణం చేతనైన లబ్ధి పొందని అర్హులైన వారికి ద్వైవార్షిక పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. కలెక్టర్ బసంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 11.84 కోట్లతో 7422 మందికి ప్రస్తుతం లబ్ధి చేకూరిందన్నారు. పంటల బీమా 2021కి సంబంధించి 2154 మందికి రూ.10.70 కోట్లు మంజూరు అయిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఒక్కళిగ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ నళిని, ఏడీసీసీ బ్యాంకు ఛైర్‌పర్సన్ లిఖిత, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఆవుటాల రమణారెడ్డి, పుడా ఛైర్‌పర్సన్ లక్ష్మీ నరసమ్మ, మున్సిపల్ ఛైర్మన్ ఓబుళపతి, ఎంపీపీ రమణారెడ్డి, చేనేత జౌళిశాఖ ఏడి రమేష్, వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, మాజీ ఎడిసిసి బ్యాంక్ ఛైర్మన్ పామిడి రామాంజనేయులు పాల్గొన్నారు.










