ప్రజాశక్తి-నార్పల అర్హులైన రైతులందరికీ ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలను అందించేందుకు రైతు భరోసా సిబ్బంది కృషి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ సూచించారు. ఈమేరకు శుక్రవారం మండలంలోని నాయనపల్లి రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రబీ సీజన్‌లో సాగు చేసిన పంటలకు పంట నమోదుతోపాటు ఇకెవైసి చేయించుకోవాలని సూచించారు. అలాగే పిఎం కిసాన్ లబ్ధిదారులు సైతం ఇకెవైసి చేయించుకోవాలన్నారు. అలాగే గ్రామాల్లో ఉన్న కౌరుదారులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు భరోసా కేంద్రం సిబ్బందిని ఆదేశించారు. ఇకపోతే నిస్సహాయ స్థితిలో ఉంటున్న రైతుల సహాయార్థం ఏర్పాటు చేసిన రైతు జీవనరేఖ హెల్ప్ లైన్ నంబర్ 9490900800- 08554-297328కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం నార్పల-2లోని రైతు భరోసా కేంద్రం వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొని జీవనరేఖ కార్యక్రమంపై వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్, సభ్యులు, రైతు భరోసా సిబ్బంది సరస్వతి, శ్రీజ, ఎఇఒ శైలజ, పశువైద్యాధికారి గోవిందరాజు, రైతులు పాల్గొన్నారు.
పుట్లూరు : మండలంలోని శనగల గూడూరు రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం గ్రామస్థాయి అగ్రి అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్నిజిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాతుడూ ఈ రబీ సీజన్‌లో పంటలు సాగు చేసిన రైతులు అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే పీఎం కిసాన్ కోసం ఇకెవైసి చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఒ కాత్యాయని, గ్రామ రైతులు, సర్పంచి, ఉప సర్పంచి, ఆర్‌బికె సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
చీనీతోటను పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు










