చిలమత్తూరు : చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి దందా జరుగుతోంది. ప్రతి పనికీ ఇంతా.. అంతా అంటూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున దండుకుంటున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కార్యాలయానికి సంబంధించి రెగ్యులర్ సబ్ రిజిస్టార్ సెలవులో ఉన్నారు. ఈయన స్థానంలో కొత్తగా సీనియర్ అసిస్టెంట్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు కార్యాలయంపై పట్టులేక పోవడంతో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసే ఓ ప్రయివేటు వ్యక్తి అన్నీతానై చక్రం తిప్పుతూ ప్రజల వద్ద వేలాది రూపాయలు దండుకుంటున్నట్లు తెలుస్తోంది. కార్యాలయంలో ఏ పని జరగాలన్నా ప్రతి పనికీ డబ్బులు అడుగుతూ సదరు కంప్యూటర్ ఆపరేటర్ దందాకు పాల్పడుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకం కింద జరుగుతున్న భూ రీ సర్వే నేపథ్యంలో ఆర్‌హెచ్, ఈసీ నకళ్లకు డిమాండ్ పెరిగింది. దీనిని ఇచ్చేందుకు ప్రభుత్వంకు చెల్లించే చలానా కన్నా, కమిషన్ రూపంలో ఇచ్చుకునేదే అధికంగా ఉంటోందని ప్రజలు వాపోతున్నారు.
శాశ్వత భూ హక్కు... భూ రక్షతో డిమాండ్..
మండలంలో జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకంలో భాగంగా భూమి రీ సర్వే జరుగుతున్న నేపథ్యంలో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భూమి ఆ రైతుకు ఎలా వచ్చింది అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే సర్వే నెంబర్ చరిత్ర అవసరం అవుతోంది. దీంతో భూ ప్రాథమిక రికార్డ్‌లుగా ఉన్న డైక్లాట్ మొదలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లభ్యమయ్యే ఆర్‌హెచ్, ఈసీలకు ప్రాధాన్యతతో పాటు వాటి నకళ్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే దానిని అదనుగా చేసుకుని అమాయక భూ యాజమానులు రైతులు నుంచి పెద్ద మొత్తంలో వసుళ్లుకు పాల్పడుతుండటం గమనార్హం.
5గం|| తరువాతే ఈసి, ఆర్‌హెచ్
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లభ్యమయ్యే ఆర్‌హెచ్ కాపీలు నుంచి ఈసీలు నకలు వరుకు ఏది కావాలన్నా దరఖాస్తు పెట్టుకున్న వారి వద్ద చలనా పేరుతో డబ్బులు కట్టించుకోవడం దానికి రసీదు ఇవ్వక పోవడం సర్వసాధారణం అయ్యింది. దీనికి తోడు సాధారణంగా ఆర్‌హెచ్ కాపీకి రూ.400 చలానా అయితే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత ఆ నకళ్లు కావాల్సిన వారిని రమ్మనడం అదనంగా రూ.600 వసూలు చేసి, తరువాత వాటి పత్రాలు ఇవ్వడం పరిపాటిగా మారింది. గత కొన్ని రోజులుగా నిత్యం ఇదే తంతు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈసీకి మాన్యువల్‌కు ఓ రేటు, కంప్యూటర్ ఈసీకి ఓ రేటు ఉంటుంది. ఇక్కడ ఏది కోరినా అదనంగా రూ. 600 చెల్లించకమాత్రం తప్పడం లేదు. అవసరాన్ని బట్టి ఈ మొత్తాన్ని మరింత పెంచేస్తున్నారు. ఇక రోజు వారి కార్యాలయంలో పని చేసే మధ్యవర్తులు రియల్టర్‌లు ఆర్‌హెచ్, ఈసీకి అదనంగా రూ.200 చెల్లిస్తున్నట్లు తెలుస్తుంది. ముందే డబ్బులిస్తే క్షణాల్లో పని అయిపోతోంది. డబ్బులు ఇవ్వని పక్షంలో సర్వర్ పనిచేయడం లేదంటూ తిప్పుకుంటున్నారు. చేసేది లేక చాలా మంది డబ్బులు అదనంగా సమర్పించి వారికి కావాల్సిన ఈసీ పత్రాలను తీసుకుని వెళ్తున్నారు. ఇటీవల చిలమత్తూరు సబ్‌రిస్టర్ కార్యాలయం వద్దకు 5 గంటల తరువాత వెళ్తే ఇలాంటి పరిస్థితి నిత్యం కన్పిస్తూనే ఉంది. ప్రయివేటు కంప్యూటర్ ఆపరేటర్‌లు, సిబ్బందిలో కొందరు అవినీతికి పాల్పడుతుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ అవినీతి దందాపై నిఘా ఉంచాల్సిన ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం అక్రమార్కులకు అదనపు బలంగా మారుతోంది.
చర్యలు తీసుకుంటాం
ఇన్‌ఛార్జి సబ్ రిజిస్టార్ పారిజాత
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వసుళ్ల పర్వంపై ప్రజాశక్తి ఇన్‌ఛార్జి సబ్ రిజిస్టార్ పారిజాతను ప్రజాశక్తి వివరణ కోరింది. దీనిపై స్పందించిన అధికారి అక్కడి సిబ్బందితో వెంటనే మాట్లాడారు. ఈసీ నకళ్లకు సంబంధించి బిల్లులు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. బిల్లు పుస్తకాలు అయిపోవడంతో తెల్లకాగితంపై రాసి ఇస్తున్నామంటూ సిబ్బంది సమాధానం ఇచ్చారు. అనంతరం సబ్‌రిస్టార్ ప్రజాశక్తితో మాట్లాడారు. భూ రీ సర్వే నేపథ్యంలో ఈసీ, ఆర్‌హెచ్ కాపీలకు ధరఖాస్తులు అధికంగా వస్తున్న మాట వాస్తవం అన్నారు. దీనికి సంబంధించి బిల్లులు ఇవ్వడం లేదన్నది తనకు తెలియదని, ఇకపై అలా జరగకుండా అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైన అధిక మొత్తంలో డబ్బులు వసుళ్లు చేస్తే తనకు ఫిర్యాదు చేయాలన్నారు. అధికంగా డబ్బులు వసూళ్లు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.










