ప్రజాశక్తి ముదిగుబ్బ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతనంగా చేపట్టిన గ్రీన్ వే రహదారి నిర్మాణం కోసం తమ జీవనాధారమైన సాగు భూములు కోల్పోతున్నామని తమకు సంతృప్తికరమైన పరిహారం అందించాలని నిర్వాసిత రైతులు కోరారు. గురువారం మండల పరిధిలోని కొండగట్టుపల్లి మలక వేముల క్రాసులో భూములను సర్వే చేయాలని వచ్చిన ధర్మవరం ఆర్డీవో తిప్పానాయక్ ఎదుట నిర్వాసిత రైతులు తమ సమస్యను విన్నవించారు. ఈసందర్భంగా కొండగట్టుపల్లి గ్రామానికి చెందిన రైతు నరేష్ పురుగుల మందు తాగడానికి ప్రయత్నించగా స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఎకరాకు రూ. 3లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు వచ్చేలా చర్యలు తీసుకుంటానని కొండగట్టుపల్లి రైతులకు అధికారులు హామీ ఇచ్చారు. అనంతరం మలక వేమల క్రాస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు తమ నిర్ణయాన్ని వెలుబుచ్చారు. తాము తమ భూములు ఇవ్వడానికి అనుకూలంగా లేమని ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలా తక్కువగా ఉందనితమకు రెండు రోజులు గడువు ఇస్తే నిర్ణయించుకొని తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని రైతులు ఆర్డీవోకు చెప్పారు.










